స్టార్ బక్స్ తరహాలో అరకు కాఫీ బ్రాండ్ ను డెవలప్ చేయాలని అనుకుంటున్న ఏపీ ప్రభుత్వం అందుకు తగ్గ అవకాశాల కోసం విస్తృతంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా లగ్జరీ కాఫీ ఔట్లెట్లను ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహం ఇస్తోంది. తాజాగా… పార్లమెంట్‌లోనూ అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసేలా చేసిన కృషి ఫలించింది. రెండు స్టాళ్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారానికి అవకాశం కల్పించేందుకు స్పీకర్ ఈ అవకాశం ఇచ్చారు. సంగం 1, 2 కోర్టు యార్డ్ వద్ద కాఫీ స్టాళ్లు ఏర్పాటుకు స్పీకర్ అనుమతిఇచ్చారు.
అరకు కాఫీ ఉత్పత్తి , విక్రయాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన సహకార సంస్థల ద్వారా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకు కాఫీ మార్కెట్‌ను 3000 కోట్ల రూపాయలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. విదేశాల్లో అరకు కాఫీకి మంచి డిమాండ్ ఉంది. అయితే అది విస్తృతం కాలేదు. ఇప్పటికి వందల కోట్లలోనే మార్కెట్ జరుగుతోంది.దాన్ని మూడు వేల కోట్లకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మంచి క్వాలిటీ కాఫీ కావడంతో ధర సహజంగానే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది లగ్జరీ బ్రాండ్ గా మారింది. ఈ కాఫీ విలువను అదే స్థాయిలో ప్రొజెక్ట్ చేయడానికి ఖరీదైన బ్రాండ్ గానే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్యంత సహజమైన పద్దతుల్లో సేకరించి కాఫీగింజలు కావడంతో.. గిరిజనులకు గిట్టుబాటు కావాలన్నా.. ఆ మాత్రం ధర ఉంటుంది. ధర కన్నా క్వాలిటీ.. మంచి కాఫీని ఆనందించాలనుకునేవారికి మొదటి చాయిస్‌గా అరకు కాఫీ ఉంటుందనడంలో సందేహం ఉండదు.