Araku MLA kidari sarveswara rao
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు..మావోయిస్టులు అత్యంత దారుణంగా హతమార్చారు. డుంబ్రీగూడ మండలి లిప్పిటిపుట్టు అనే గ్రామం వద్ద మావోయిస్టులు… ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. యభై మందికి పైగా మావోయిస్టులు ఒక్కసారి దాడి చేసి.. కాల్పులు జరపడంతో… కిడారి సర్వేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందారు. ఆయనతో పాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కూడా కాల్చి చంపారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే సారధ్యంలో ఈ దాడి జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కిడారి సర్వేశ్వరరావు.. గ్రామదర్శిని కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు. మరమూల గ్రామాల్లోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం.. గ్రామదర్శిని పాల్గొనేందుకు వెళ్తూండగా మావోయిస్టులు దాడి చేశారు.
గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు కిడారి సర్వేశ్వరరావు. ఆ తర్వతా జగన్ పట్టించుకోవడం లేదని… ఇతరులకు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారన్న మనస్థాపంతో.. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయనపై గత ఎన్నికల్లో టీడీపీ తరపున సివేరి సోమ పోటీ చేశారు. ఇద్దరూ కాల్పుల్లో మృతి చెందారు. ఇటీవల కాలంలో ఏజెన్సీలో మావోలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో అవకాశం కోసం మావోయిస్టులు ఎదురుచూస్తున్నారు. ప్రజా ప్రతినిధులను టార్గెట్గా చేసుకుని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కిడారి సర్వేశ్వరరావుని టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. మావోయిస్టుల దాడితో ఏపీలో హైఅలర్ట్ ప్రకటించారు. డీజీపీ విశాఖ బయలుదేరి వెళ్లారు.
నిజానికి బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదు. అనుమతులు కూడా రద్దు చేశారు. కానీ మావోయిస్టులు.. ఇటీవలి కాలంలో..ఓ భారీ టార్గెట్ పెట్టుకుని ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. అందుకే ప్రజాప్రతినిధులను.. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అదను చూసి.. మావోయిస్టులు పంజా విసిరారు. ఓ ఎమ్మెల్యే..మరో మాజీ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు.