అదేంటీ… ఎంపి అంటే మాట్లాడాల్సింది పార్లమెంట్లోనే కదా… అందులో విశేషం ఏముందీ… అని ఎవరైనా ప్రశ్నిస్తే… అందరు ఎంపిలలా కాదండీ… తన రూటే వేరు అని పలువురు అంటున్నారు. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు నుంచి ఎంపిగా గెలిచిన కొత్త పల్లి గీత గురించి ఇలాంటి కామెంట్స్ రావడం వెనుక ఆమె వ్యవహార శైలే కారణం.
గత ఎన్నికల్లో అరకు నుంచి వైసీపీ పార్టీ అభ్యర్ధిగా గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు (?)… ఫిరాయించీ ఫిరాయించనట్టుగా ఉన్న కొందరు నేతల్లానే ఈమె జంపింగ్ కూడా సందిగ్థమే అనుకోండి. అదలా ఉంచితే… ఆమె ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీకి జంప్ చేసినా… కాస్తంత ప్రజా సమస్యల్ని పట్టించుకుంటే బాగుండేది అని ఆమె నియోజకవర్గంలో తన శ్రేయోభిలాషులకు కూడా ఉన్న అభిప్రాయం. అయితే గెలిచిన దగ్గర్నుంచీ పార్టీ మార్పుడు, భూవివాదం, బ్యాంకులకు టోపీ వంటి విషయాలతో తప్ప ప్రజలకు మేలు చేకూర్చే ఏ పనుల ద్వారా కూడా ఆమె వార్తల్లోకి ఎక్కింది లేదు. పైగా నియోజకవర్గ ప్రజలకు చాలా దూరంగా ఉంటారనే పేరు పడ్డారు.
ఈ నేపధ్యంలో తాజాగా గురువారం పార్లమెంట్లో తాను సైబర్ క్రైమ్ అంశాన్ని లేవనెత్తబోతున్నానని ఆమె ఓ ప్రకటన చేశారు. దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలు. వాటికి పరిష్కారాలపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతానని చెప్పారు.. ఇది నిజంగా సీరియస్ అంశమే కాబట్టి… అభినందించాల్సిందే. సైబర్ నేరాల బాధితుల సంఖ్య ఇబ్బడి ముబ్బడి అవుతున్న నేపధ్యంలో దీనిపై పార్లమెంట్లో ప్రశ్నించడం బాధ్యతా యుతమైన ప్రజాప్రతినిధి చేయవల్సినదే.
అయితే అసలామెకి ఇంతగా ఆ అంశం మీద ఆవేశం కలగడానికి కారణం… ఆమెకి బెదిరింపు ఇమెయిల్స్ రావడం. తన అక్రమ ఆస్తుల వివరాలకు సంబంధించిన ఫైల్ ఎసిబి దగ్గర ఉందని కొందరు అగంతకులు ఆమెకు మెయిల్ చేశారు. ఆ ఫైల్ కావాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ముట్ట జెప్పాలని కూడా వారు డిమాండ్ చేశారు. అదీ విషయం. దీంతో అగ్గిమీద గుగ్గిలం అయిపోయిన గీత గారు… పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు పార్లమెంట్లో లేవనెత్తుతానన్నారు.
తనదాకా వస్తేనే సమస్య కాకపోతే కాదు అన్నట్టు… తనకు సమస్య వచ్చింది కాబట్టి పార్లమెంట్లో మాట్లాడతానన్న ఈ ఎంపి… గతంలో ఎన్ని ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడారంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. పేరుకు మాత్రమే ఎంపిగా ఉన్న ఆమె… ఇదే రకమైన స్పందనను గతంలో కూడా చూపించి ఉంటే బాగుండేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇకనైనా తన మీద పడ్డ ముద్రను ఆమె చెరిపేసుకుని, తొలిసారి ఎంపిగా తన పనితీరును మెరగుపరచుకుంటే మంచిదని సూచిస్తున్నారు.