ARANYA REVIEW
తెలుగు360 రేటింగ్ 2.5/5
కొన్నిసినిమాలు చూస్తున్నప్పుడు కథ… కథనం… కమర్షియల్ అంశాల్లాంటివేవీ గుర్తుకు రావు. జస్ట్… తెరపై కనిపిస్తున్న ఆ ప్రపంచంలో మనం భాగమైపోతుంటాం. తెరపై పాత్రలతో కలిసి ప్రయాణం చేస్తుంటాం. అలా జరిగిందంటే ఆ కథాంశంలో స్వచ్ఛత, నిజాయతీ ఉన్నట్టే . మరి ఇలాంటి సినిమాలు బాక్సాఫీసు ఏ స్థాయిలో నిలదొక్కుకుంటాయి? ఎన్ని వసూళ్లు రాబడతాయని అడిగితే మాత్రం సమాధానం అంత సులభమేమీ కాదు. ఓ మంచి ప్రయత్నం అని ప్రేక్షకుల నుంచి వీరతాళ్లు మాత్రం పడతాయి. అరణ్య అలాంటి చిత్రమే.
కథ :
ఇందులో కథ కొత్తదేమీ కాదు. కార్పొరేట్ శక్తులు అడవులపై కన్నేయడం, సహజ సంపదని నాశనం చేయడం, వ్యాపార దురాగతాలకి పాల్పడటం నేపథ్యంలో సాగే కథల్ని చాలా సినిమాల్లో చూశాం. ఇది కూడా ఆ తాను ముక్కే. నరేంద్ర భూపతి (రానా) ఫారెస్ట్ మేన్‌గా రాష్ట్రపతి నుంచి అవార్డ్ పొందిన వ్యక్తి. తరతరాలుగా అడవుల్ని, ఏనుగుల్ని రక్షిస్తున్న కుటుంబం ఆయనది. అడవికే అంకితమైన మనిషి కాబట్టి అందరూ అరణ్య అని పిలుస్తుంటారు. అరణ్య పక్షులతో మాట్లాడుతుంటాడు. మొక్కలతో స్నేహం చేస్తుంటాడు. పచ్చగా సాగిపోతున్న అతని అడవిపై కేంద్ర అటవీశాఖ మంత్రి (అనంత్ మహదేవన్) కన్ను పడుతుంది. అక్కడ ఓ టౌన్షిప్ కట్టాలని ప్లాన్ చేస్తాడు. అడవిని ఛిద్రం చేయడం మొదలుపెడతాడు. ఏనుగులు నీళ్లు తాగే పరిస్థితులు కూడా లేకుండా గోడ కట్టేస్తాడు. మరి అప్పుడు అరణ్య ఏం చేశాడు? అతనిపై ఎలా పోరాటం చేశాడనే విషయాలతో సినిమా సాగుతుంది.
విశ్లేషణ:
పచ్చటి అడవులు, ఏనుగులపై మమకారం ఉన్న దర్శకుడు ప్రభు సాల్మన్. ఆయన ఇదివరకటి సినిమాలు కూడా అడవులు, ఏనుగుల నేపథ్యంలో సాగాయి. ఈసారి ఆ నేపథ్యంలోనే… కాస్త లోతైన అంశాన్ని స్పృశించాడు. అది ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ అంశం కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో చెప్పాలనుకున్నాడు. ఏనుగులుంటే అడవులు ఉంటాయి, అడవులుంటే వర్షాలు కురుస్తాయి, వర్షాలు కురిస్తేనే మనమంతా బతుకుతాం అనే విషయాన్ని దర్శకుడు ఈ కథతో చెప్పిన విధానం ఆలోచన రేకెత్తిస్తుంది. ఏనుగుల జీవితాల గురించి, అవి మానవాళికి చేసే మేలు గురించి… అడవుల ప్రాముఖ్యత గురించి దర్శకుడు చాలా డిటైల్డ్‌గా.. అదే సమయంలో కథలో ఆసక్తి సన్నగిల్లకుండా చెప్పిన తీరు మెప్పిస్తుంది. ఒక పక్క అరణ్య పాత్రని ఎస్టాబ్లిష్ చేస్తూనే… మరోపక్క ఉపకథలతో సినిమాని ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. ఏనుగులకీ, అరణ్యకీ మధ్య బంధాన్ని ఆవిష్కరించిన తీరే ఈ సినిమాకి ప్రధానబలం.
అయితే ఉపకథల్లో బలం లేకపోవడం సినిమాకి మైనస్‌గా మారింది. ప్రథమార్థంలో కనిపించిన నక్సలైట్ మల్లి (జోయా) కుమ్కీ ఏనుగు శింగన్న (విష్ణువిశాల్) పాత్రలు ద్వితీయార్థంలో హఠాత్తుగా మాయం అవుతాయి. దాంతో ఎలాంటి డ్రామా లేకుండా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సన్నివేశాలు సాగుతాయి. పతాక సన్నివేశాలపై మళ్లీ దర్శకుడు పట్టు ప్రదర్శించాడు. అరణ్య, ఏనుగుల మధ్య బాండింగ్ నేపథ్యంలోనే ఆ సన్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం అలరిస్తుంది. అక్కడ చెప్పిన సంభాషణలు కూడా ఆలోచింపజేసేలా ఉంటాయి. ప్రయత్నం మంచిదే. కానీ ఈ సినిమా కోసం దర్శకుడు చేసిన కసరత్తులే చాలలేదు. అడవుల నేపథ్యంలో ఎంత సహజంగా సినిమా కనిపిస్తుందో, కొన్ని సన్నివేశాలు అంతే అసహజంగా అనిపిస్తాయి. ముఖ్యంగా అడవిలో ఓ పెద్ద చెట్టుపై సాగే యాక్షన్ ఘట్టాలు. అలాంటి సన్నివేశాలపై మరికాస్త దృష్టిపెట్టాల్సింది. మొత్తంగా ఒక మంచి థీమ్, ఆహ్లాదరకమైన అడవీ నేపథ్యం, ఆలోచింపజేసే సందేశం నచ్చే వాళ్ళు ఒక్కసారి చూడాల్సిన చిత్రమిది.
నటన:
రానా పాత్రలో ఒదిగిపోయాడనడం కంటే జీవించాడని చెప్పాలి. అడవి మనిషిలా కనిపించడం కోసం ఆయన పలికించిన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రానా నిజంగానే నటుడిగా ఎంతో ఎదిగాడనిపిస్తుంది అరణ్య పాత్ర. జోయా, విష్ణు విశాల్ మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. కానీ దానికి సరైన ముగింపే ఉండదు. ఇద్దరి అభినయం ఆకట్టుకుంటుంది. శ్రియ పిల్గోంకర్ కథని మలుపుతిప్పే పాత్రలో, ఓ జర్నలిస్టుగా కనిపిస్తుంది. రఘుబాబు, అనంత్ మహదేవన్ తదితరులు కీలక పాత్రల్లో మెరుస్తారు.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేశారు. ఆ శబ్దాలు నిజంగా అడవుల్లో తిరుగుతున్న అనుభూతిని కలగజేస్తాయి. అశోక్‌కుమార్ అడవుల్ని అత్యద్భుతంగా కెమెరాలో బంధించాడు. శంతను మొయిత్రా సంగీతం ఆకట్టుకుంటుంది. దర్శకుడు ప్రభు సాల్మన్ ప్రేక్షకుడిని అరణ్య ప్రపంచంలో లీనమయ్యేలా చేయడంలో విజయవంతమయ్యాడు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
Verdict :
దర్శకుడి ఉద్ధేశం మంచిది. ఆలోచన మంచిది. అడవులపై, ఏనుగులపై, పర్యావరణంపై తనకు సానుభూతి ఉంది. అది మనందరికీ ఉండాలన్న విషయాన్ని గుర్తు చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో లాజిక్కులు వదిలేశాడు. సినిమాలో ఎలాంటి విషయాన్ని చెప్పినా జనరంజకంగా ఉండాలన్న నియమం మర్చిపోయాడు. కాకపోతే.. విజువల్ గా గ్రాండియర్ గా ఉంది. ఆ పచ్చదనం, గ్రాఫిక్స్ వాడుకున్న విధానం నచ్చేస్తాయి. అడవులపై, పర్యావరణంపై ప్రేమ ఉన్నవాళ్లు ఓసారి చూడొచ్చు.
తెలుగు360 రేటింగ్ 2.5/5