Spoiler Alert : మీరు ఇంకా సినిమా చూడకపోతే , ఇక్కడే చదవడం ఆపేసి .. చూసిన తరువాత తిరిగి రండి !
త్రివిక్రమ్ బలం.. బలగం.. సంభాషణలే. దర్శకుడిగా ఇన్ని సినిమాలు తీసినా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బ్లస్టర్లు ఇచ్చినా.. త్రివిక్రమ్‌ని చాలా మంది ఇంకా ‘రచయిత’గానే గుర్తిస్తారు. త్రివిక్రమ్ బాధ కూడా అదే. ‘అతడు లాంటి సినిమా తీసినప్పుడుకూడా నన్ను రచయితగానే చూశారు’ అంటూ వాపోతుంటాడు. నిజానికి.. త్రివిక్రమ్‌ని చాలాసార్లు నిలబెట్టింది అతనిలో ఉన్న రచయితే. పవన్ కల్యాణ్ లాంటి మాస్ హీరోని పట్టుకొని, క్లైమాక్స్‌ని కేవలం ‘మాటల’తో ముగించాడంటే – అదంతా త్రివిక్రమ్ రచనా నైపుణ్యమే. ‘అరవింద సమేత వీర రాఘవ’లో కూడా త్రివిక్రమ్లోని రచయిత మరో కోణంలో బయటపడ్డాడు. అలరించాడు.
అరవింద సమేత ఏం కొత్త కథ కాదు. ‘మిర్చి’లానే ‘చంపుకోవడం – నరుక్కోవడం వద్దు’ అని చెప్పే కథ. ఇలాంటి మాటలు చాలాసార్లు చెప్పారు. అందుకే కథా పరంగా ‘అరవింద’ కొత్తగా అనిపించదు. అయినా సెల్యులాయిడ్‌పై ఆ సినిమాని గుండెలకు హత్తుకునేలా తీయడంలో త్రివిక్రమ్లోని రచయిత బయటకు వచ్చాడు. ‘అత్తారింటికి..’ ఫార్ములానే త్రివిక్రమ్ ఇక్కడా పాటించాడు. ఎన్టీఆర్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోని పట్టుకుని ‘డైలాగుల’లతో నడిపించాడంటే.. తన పెన్ పై త్రివిక్రమ్‌కి ఉన్న నమ్మకమే కారణం.
‘అజ్ఞాతవాసి’లో త్రివిక్రమ్ లోని డైలాగ్ రైటర్ పూర్తిగా పట్టు తప్పాడు. `త్రివిక్రమ్ ఏమిటి? ఇలా రాశాడు? సరుకు అయిపోయిందా` అనే అనుమానాలు రేకెత్తించాడు. ‘అరవింద’లో తన గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. ఎక్కడా ప్రాసల కోసం, పంచ్‌ల కోసం ప్రయత్నించలేదు. ఆ మాట కొస్తే… ఒక్కసారి కూడా పంచ్‌ల త్రివిక్రమ్ కనిపించడు. కథని పట్టుకుని కూర్చున్న త్రివిక్రమే కనిపిస్తాడు. తనకి వీలైన చోటే… తన మార్క్ చూపించాలనుకున్నాడు. ఓ విధంగా త్రివిక్రమ్ తనని తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసినట్టే.
‘వీరా నువ్వు కత్తి పట్టినట్టు లేదు. అది నీ చేతికి మొలిచినట్టు ఉంది’ అని రాయడం – నిజంగా త్రివిక్రమ్‌కే చెల్లింది. ఆ డైలాగ్ రాయడానికి కారణం.. మొదటి యాక్షన్ ఎపిసోడే. ఆ డైలాగ్ లోని తీవ్రతకు యాక్షన్ ఘట్టం అద్దం పట్టింది కూడా.
ద్వితీయార్థంలో ఓ చోట ఎన్టీఆర్ చేత పిట్ట కథ చెప్పించాడు త్రివిక్రమ్. ఒకే కథని రెండు విధాలుగా చెప్పి – ‘నీకేం కావాలో తేల్చుకో’ అంటాడు. మొత్తం సన్నివేశాన్ని, అందులోని ఆర్థ్రతని పిట్ట కథలో రంగరించడం, తద్వారా నవీన్ చంద్రలో మార్పు తీసుకురావాలనుకోవడం – మంచి ప్రయత్నం.
ఎన్టీఆర్ – పూజా హెగ్డేకి మధ్య జరిగిన సంభాషణల్లోనూ ఎక్కడా రొమాంటిక్ కోణంలో ఆలోచించలేదు. వీలైనంత వరకూ అక్కడ కూడా త్రివిక్రమ్ తనదైన స్పేస్ తీసుకున్నాడు.
”అబ్బాయిలు అమ్మాయిలకు గోల్డ్ కొనివ్వాలి, డైమండ్స్ కొనివ్వాలి… గిఫ్ట్స్ కొనివ్వాలి.. అని ఆలోచిస్తారు. ఇవన్నీ అక్కర్లెద్దు.. కొంచెం టైమ్ ఇస్తే చాలు” – ప్రతి అమ్మాయి ఆలోచన ఇదే. దాన్ని భలే చదివేశాడు త్రివిక్రమ్. చదవడమే కాదు.. అందరికీ అర్థమయ్యేలా రాయగలిగాడు.
అమ్మాయి పడనంత వరకూ వాళ్లే లోకంగా బతుకుతారు.. పడిన తరవాత… ఆమె భుజంపై నుంచి లోకాన్ని చూడడం మొదలెడతారు.. అనేది పూజాతో చెప్పించి, అక్కడితో వదలకుండా దానికి కౌంటర్ కూడా ఎన్టీఆర్‌తో వేయించి – అబ్బాయిలవైపు, అమ్మాయిలవైపు వకాల్తా పుచ్చుకున్నాడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ – రావు రమేష్‌ల మధ్య కప్పు – సాసర్కి సంబంధించయిన డైలాగ్లోనూ చాలా లోతు ఉంది.
”ఊర్లో టీ ని సాసర్లో పోసుకుని తాగుతారు. కానీ టీని గ్లాసులో పోసి ఇస్తారు. సిటీలో టీని కప్పుతో తాగుతాం. కానీ కప్పుతో పాటు సాసర్ కూడా ఇస్తారు. ఉన్నప్పుడు ఉపయోగించుకోం, ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఉండదు..”
– ఇది ఒక్కసారి వింటే సరిపోదు. పరిస్థితులకు అన్వయించుకోవాలి. అప్పుడే ఆ మాటల విలువ తెలుస్తుంది.
‘తగ్గితే తప్పేంటి’ అనేది చాలా చిన్న డైలాగే. కానీ శక్తిమంతమైనది. యుద్దాల్ని సైతం ఆపేసే సత్తా ఉన్నమాట. ”ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు” అనే డైలాగ్‌కి ఇది కొత్త వెర్షన్ లాంటిది. ఈ సినిమా మొత్తం ఒక్క డైలాగ్‌లో తేల్చిపారేశాడు త్రివిక్రమ్. ఈ డైలాగ్ చుట్టూనే కథంతా నడిపేశాడు.
ఇలా ఒకటీ రెండు కాదు… ఈ సినిమాలో ఇలాంటి డైలాగులు డజన్లకొద్దీ ఉన్నాయి. వీటి విలువ సినిమా చూస్తున్నంతసేపు తెలియకపోవొచ్చు. ఒక్కసారి సినిమా పూర్తయ్యాక… ప్రతీ డైలాగునీ విశ్లేషించుకుంటూ వెళ్తే… అందులోని లోతు, విలువ అర్థం అవుతాయి.
హ్యాట్సాఫ్…. త్రివిక్రమ్!!
థ్యాంక్యూ… త్రివిక్రమ్!!