తెలుగు360 రేటింగ్: 3/5
యుద్ధం చేయాల్సిన చోట కూడా కత్తిని విసిరేయడం పిరికితనం కాదు.. దానికీ ధైర్యం ఉండాలి.
తలలు తెంచాల్సిన చోట… వంచడం చేతకానిదనం కాదు… దానికీ దమ్ముండాలి.
త్రివిక్రమే ఇంతకు ముందు చెప్పినట్టు ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసుండాలి’.
బహుశా – ‘అరవింద సమేత వీర రాఘవ’ ఆలోచనకు అది ఆది కావొచ్చు. ఆ ఆలోచన ఆజ్యం పోయొచ్చు.
ఫ్యాక్షనిజం అంటే తలలు నరుక్కోవడం అని చెప్పిన ఏ సినిమా… ఫ్యాక్షనిస్టుల తలరాతలు మార్చే అవకాశం ఉందా? అని ఆలోచించలేదు. బహుశా ‘మిర్చి’తో దానికి తొలి అడగు పడిందనుకుంటే ‘అరవింద’తో రెండో అడుగు పడింది.
త్రివిక్రమ్ తొలిసారి ఫ్యాక్షనిజం కథ ఎంచుకున్నాడంటే
ఎన్టీఆర్ మరోసారి ఫ్యాక్షనిజం పండించాలనుకున్నాడంటే..
ఈసారి ఏదో కొత్త పాయింట్ ఉత్తేజితుల్ని చేసుంటుంది అనుకోవడం సహజం. మరి.. ‘అరవింద’లో వాళ్లు చెప్పాలనుకున్న ఆ కొత్త పాయింట్ ఏమిటి? దానికి ఎంత వరకూ న్యాయం జరిగింది?
కథ
ఫ్యాక్షనిజం గొడవల్లో తన తండ్రిని కోల్పోతాడు వీర రాఘవ (ఎన్టీఆర్). బామ్మ చెప్పిన మాటల ప్రభావంతో ఫ్యాక్షనిజాన్ని వదిలి హైదరాబాద్ చేరుకుంటాడు. అక్కడ అరవింద (పూజా హెగ్డే)ని చూస్తాడు. తన మాటలూ, బామ్మ మాటలూ ఒకేలా అనిపిస్తాయి. అవి కూడా వీర రాఘవ ఆలోచనలు మార్చడానికి దోహదం చేస్తాయి. అయితే.. శత్రువులు వీర రాఘవ రెడ్డిని వెదుక్కొంటూ హైదరాబాద్ వస్తారు. తన శత్రువుల వల్ల అరవింద కుటుంబానికి ప్రాణ హాని ఉందని భావించిన వీర రాఘవ… అందుకోసం ఏం చేశాడు? ఎర్రటి నెత్తురు చిందిన రాయలసీమలో శాంతి కపోతాన్ని ఎగరేయడానికి వీర రాఘవుడు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయా? ఈ ప్రయాణంలో వీర రాఘవకు ఎదురైన ఆటంకాలేంటి? అనేదే ‘అరవింద సమేత వీర రాఘవ’ కథ.
విశ్లేషణ
ఫ్యాక్షనిజం అనే కాన్సెప్టుని చూసీ చూసీ విసిగిపోయాం. ఎంతలా అంటే.. గడిచిన ఏడెనిమిది ఏళ్లలో ఏ ఒక్కరూ మళ్లీ ఆ జోనర్‌ని పట్టుకోలేనంతగా. అలాంటిది త్రివిక్రమ్ కొత్తగా ఏం చెబుతాడా? ఏం చూపిస్తాడా? అనే ప్రశ్నలకు ఈ కథ ప్రారంభంలోనే సమాధానం దొరికేస్తుంది. అరవింద మొదలైన తొలి 20 నిమిషాలూ ఓ యుద్ధం చూసినట్టు అనిపిస్తుంది. అసలు ఆ రెండు ప్రాంతాలమధ్య గొడవలు ఎలా మొదలయ్యాయి? రెండు ప్రాంతాల మధ్య పగలు ఏ స్థాయిలో ఉన్నాయి? అనే విషయాల్ని చాలా స్పష్టంగా, ప్రభావవంతంగా చూపించేశాడు త్రివిక్రమ్. వీర రాఘవ సీమలో అడుగపెట్టినప్పుడు జరిగిన ఫ్యాక్షన్ యుద్ధాన్ని చాలా బాగా చూపించాడు. ఆ తరవాత నాయినమ్మ మాటల ద్వారా ఈ కథ ఏ తీరానికి చేరబోతోందో చూచాయిగా హింట్ ఇచ్చాడు.
ఆ తరవాత కథ హైదరాబాద్ షిప్ట్ అవుతుంది. అరవింద- వీర రాఘవ – నీలాంబరి మధ్య జరిగే సన్నివేశాల్లో – నరేష్ ఇంటి సీన్లలో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. అయితే బలవంతంగా వినోదాన్ని జొప్పించడానికి ఎక్కడా ప్రయత్నించలేదు. కథ ఏం చెబుతుంది? దానికి రచయితగా తానేం ఇవ్వాలో దానికే స్ట్రిక్ అయ్యాడు. అందుకే ఎన్టీఆర్ నుంచి గానీ, త్రివిక్రమ్ నుంచి గానీ ఆశించే సన్నివేశాలు ఇందులో కనిపించవు. విశ్రాంతికి ముందొచ్చే సన్నివేశం మళ్లీ… ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. ద్వితీయార్థంలో ఫ్యాన్స్‌కి హై ఇచ్చే సీన్లు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా సంధికుర్చుకునేటప్పుడు వచ్చిన సీన్. అందులో త్రివిక్రమ్ మార్క్, ఎన్టీఆర్ ఇమేజ్ స్పష్టంగా ఇమిడిపోయాయి. అక్కడ కూడా కథ ట్రాక్ తప్పలేదు. పతాక సన్నివేశాల్లో మాటల ద్వారా మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం, బసి రెడ్డి క్రూరత్వం.. ఇవన్నీ బాగా చూపించగలిగాడు. మొత్తానికి కథానాయకుడు ఏ ఆశయ సాధన కోసం ఓ ప్రయాణం మొదలెట్టాడో… దాన్ని పూర్తి చేయగలిగాడు.
చాలా చోట్ల త్రివిక్రమ్ కొత్తగా కనిపించాడు. ఎక్కడా తన మార్క్ ప్రాసలు పంచ్‌లు వాడడానికి ప్రయత్నించలేదు. ఈసారి ఆడవాళ్ల వైపు వకాల్తా పుచ్చుకున్నాడు. చాలా చోట్ల ఆడవాళ్ల మనసులోని భావాల్ని స్పష్టంగా అర్థం చేసుకున్నట్టు మాటలు రాశాడు. అందులో పూజా హెగ్డే చెప్పిన డైలాల్ ఒకటి. `మగాళ్లు ఆడదాన్ని గెలచుకున్నాక.. తన భుజం నుంచి లోకాన్ని చూడడడం మొదలెడతాడు` అనే డైలాగ్ ఒకటి. చివర్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు కూడా ఆడవాళ్ల కోణం నుంచి ఆలోచించేవే. `పాలిచ్చి పెంచిన ఆడదానికి పాలించడం ఓ లెక్కా…` అందులో ఒకటి.
హింస – రక్త పాతం వద్దు – అని చెప్పింది మిర్చి. ఆ పాయింట్‌ని త్రివిక్రమ్ బోయపాటి స్టైల్లో తీశాడనిపిస్తుంటుంది. తొలి 20 నిమిషాల్లో తెరపై చూపించిన సన్నివేశాలు ఆ రేంజులో ఉంటాయి. తన తరహా సున్నితత్వం కూడా పాటిస్తూ.. తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్.
కథానాయకుడు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒకలా.. సీమకు వచ్చినప్పుడు మరోలా మాట్లాడడంలో తప్పులేదు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడే… తన ఊరి మనుషులు కనిపించినప్పుడు సీమ బిడ్డలా మారిపోయి మాట్లాడడం మొదలెడతాడు. ఎవరూ కూడా… ప్రాంతాలు దాటొచ్చినా తమ యాసనీ, భాషనీ మార్చుకోరు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడరు. భాషపై అభిమానం ఉన్న త్రివిక్రమ్ ఆ సంగతి మర్చిపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. త్రివిక్రమ్ సినిమాల్లో లెక్కకు మించి గొప్ప సంభాషణలు ఉంటాయి. ఇందులోనూ కొన్ని డైలాగులు బాగున్నాయి. కాకపోతే.. లెక్కపెట్టలేనంత సంఖ్యలో మాత్రం కనిపించవు. `చేతికి కత్తి మొలిచినట్టు` అనే ఉపమానం అయితే.. చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. త్రివిక్రమ్ సినిమాలకు తరగని నిధిలా ఉన్న కుటుంబ ప్రేక్షకులు అదే స్థాయిలో ఈ సినిమాని ఆదరిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రిపీటెడ్‌గా చూడాల్సిన, చూసి తీరాల్సిన సినిమా కూడా కాదాయె. త్రివిక్రమ్ సినిమా అంటే వినోదం అనుకునేవాళ్లు… ఆ భావన థియేటర్ గేటు ముందే విడిచిపెట్టి, లోపలకు వెళ్లాలి. ఆ మాత్రం ప్రిపరేషన్ లేకపోతే.. ఇందులోని ఎమోషన్ని పట్టుకెళ్లడం కష్టం.
నటీనటులు
ఎన్టీఆర్ తన బలం, బలగాన్నీ పెట్టి ఈ కథని నిలబెట్టడానికి ప్రయత్నించాడు. తన మార్క్ పోరాటలు, డాన్సులు, డైలాగుల కోసం ఎక్కడా ఫోర్స్ చేయలేదు. చాలా చోట్ల కథ కోసం పాత్ర కోసం తగ్గాడు. వీలున్న చోట వీరత్వం చూపించాడు. ఓ విధంగా ఫ్యాన్స్‌కి ఇది మిక్స్డ్ ఎమోషన్ అనుకోవచ్చు. పూజా ఓకే అనిపిస్తుంది. కథలో ఆమె పాత్రని వాడుకున్న విధానం బాగుంది. నీలాంబరిగా సునీల్ నటన ఆకట్టుకుంటుంది. కాకపోతే తను కూడా ఒకే ఎమోషన్‌కి పరిమితమైపోయాడు. జగపతి బాబు మరోసారి తనలోని క్రూరత్వాన్ని మరింత క్రూరంగా పండించాడు. రావు రమేష్, శుభలేఖ సుధాకర్, ఈషా రెబ్బా ఈ పాత్రల పరిధి తక్కువ. జగపతిబాబు కొడుకుగా నవీన్ చంద్రకు మంచి పాత్ర పడింది.
సాంకేతికంగా
తమన్ నేపథ్య సంగీతం బాగా కుదిరింది. రం రుధిరం, పెనిమిటీ పాటల్నే ఆర్.ఆర్గానూ వాడుకున్నాడు. పెనిమిటీ పాట గుర్తుండిపోతుంది. త్రివిక్రమ్ సినిమాలన్నీ సాంకేతికంగా బాగుంటాయి. ఈసారీ ఆ స్థాయి తగ్గలేదు. కథకుడిగా, రచయితగా త్రివిక్రమ్ తన బలాన్ని చూపించగలిగాడు
తీర్పు
ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరీ ఊగిపోయే సినిమా కాదిది. అలాగని నిరసపడిపోవాల్సిన అవసరం కూడా లేదు. అజ్ఞాతవాసి తరవాత త్రివిక్రమ్ ఫ్యాన్స్‌లో ఓ భయం పట్టుకుంది. వాళ్లందరి మనసు కాస్త కుదుట పరిచిన సినిమా ఇది. దసరా సెలవలు కావడం, బాక్సాఫీసు బరిలో మరో సినిమా లేకపోవడం అరవిందకు కలిసొచ్చే అంశమే.
ఫైనల్ టచ్: ‘అర’ విందు
తెలుగు360 రేటింగ్: 3/5