త్రివిక్రమ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. ఎలాంటి జోనర్ ఎంచుకున్నా… వినోదం మిస్ అవ్వడు. తన బలం అదే. అతడు లాంటి ప్యూర్ యాక్షన్ క్లాస్ సినిమాలో కూడా తనదైన వినోదం జోడించాడు. అందుకే ఆ సినిమా అలా నిలబడిపోయింది. త్రివిక్రమ్ సినిమాకెళ్తే కాసేపు హాయిగా నవ్వుకుని రావొచ్చని ఫ్యాన్స్ ఫిక్సయిపోతారు. అది నిజం కూడా. అదే… ఇప్పుడు తొలిసారి ‘ఫన్’ డోసు కాస్త తగ్గించాడట. ‘అరవింద సమేత వీర రాఘవ’ కోసం. తన స్టైల్ కాస్త మార్చి ఈ కథను రాసుకున్నాడని, ప్రధమార్థంలో ఎన్టీఆర్ – పూజా హెగ్డే మధ్య సాగే లవ్ ట్రాక్ సరదాగా అలరిస్తుందని, అయితే ఈ ఫన్ కేవలం ఫస్టాఫ్‌కే పరిమితం చేశాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.
సెకండాఫ్‌లో యాక్షన్ జోరందుకుంటుందట. ఓ యాక్షన్ ఘట్టం… దాని వెంబడే సెంటిమెంట్ సీన్ – ద్వితీయార్థం దాదాపుగా ఇలానే సాగిందని తెలుస్తోంది. సెకండాఫ్‌లో సునీల్ చేసే కామెడీనే కాస్త రిలీఫ్ అని, అది మినహాయిస్తే… సెకండాఫ్ మొత్తం సీరియెస్ మోడ్‌లోనే సాగుతుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ నుంచి ఇలాంటి సినిమాని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరని, అలాంటి సినిమాని త్రివిక్రమ్ ఇవ్వబోతున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫన్ మాట పక్కన పెడితే త్రివిక్రమ్ ఎమోషన్ సీన్లని ఇంకా బాగా రాసుకుంటాడు. త్రివిక్రమ్ రాసే సీరియెస్ డైలాగులు అభిమానులకు ఇంకా గుర్తుంటాయి. ఆ కోణాన్ని ఈ సినిమాలో మరింత పదునుగా చూపించబోతున్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే అనుకునేవాళ్లు కచ్చితంగా మైండ్ సెట్ మార్చుకుని చూడాల్సిన సినిమా ఇదని తెలుస్తోంది. మరి ఈ మార్పు `అరవింద`పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.