తిరుమల తిరుపతితోపాటు, చుట్టుపక్కల దేవాలయాలను పురావస్తు శాఖకు అప్పగించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ ఒక లేఖ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొన్ని కోట్ల మంది మనోభావాలతో ముడిపడ్డ తిరుమలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు కేంద్రం వేసిన కొత్త ఎత్తుగడ ఇది అనే విమర్శలు గుప్పుమన్నాయి. దీంతో ఈ లేఖపై పురావస్తు శాఖ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సమాచార లోపం కారణంగా ఈ లేఖను పంపారంటూ వివరణ ఇచ్చింది. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ, టీటీడీకి మరో లేఖ రాసింది పురావస్తు శాఖ. దీంతో తీవ్రరూపం దాల్చబోతున్న వివాద తీవ్రతను ముందుగానే అర్థం చేసుకుని, కేంద్రం వెనకడుగు వేసినట్టయింది.
ఈ క్రమంలో గమనించాల్సిన అంశం ఏంటంటే.. భారతీయ జనతా పార్టీ అత్యుత్సాహం. పురావస్తు శాఖ నుంచి లేఖ విడుదల అయితే… దానిపై వివరణ ఇవ్వాల్సింది ఆ శాఖ, లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రధానమంత్రి కార్యాలయం. అంతేగానీ, మధ్యలో భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటండీ..? పైగా, ఈ మధ్య ఏపీలో జీవీఎల్ నరసింహారావు హడావుడి బాగా ఎక్కువైపోయింది. తనని తాను అత్యంత క్రియాశీలమైన నాయకుడిగా నిరూపించుకునేందుకు ఏపీని వేదికగా చేసుకున్నట్టున్నారు. పురావస్తు శాఖ లేఖ నేపథ్యంలో ఆయన అత్యుత్సాహానికి పోయారు. వాస్తవాలు తెలుసుకోకుండా… ట్విట్టర్ లో స్పందించేశారు. కేంద్ర ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశాలేవీ లేవనీ, కొన్ని రాజకీయ సమూహాలు చేస్తున్న కుట్రపూరిత ప్రచారం ఇది అంటూ తొందరపడి ట్వీట్ పెట్టేశారు. పురావస్తు శాఖ లేఖ విడుదల చేసిందన్న సంగతిని కూడా ఆయన పట్టించుకోలేదు! అంటే, ఈ విషయం తెలిగానే తానే ముందే స్పందిచేశానని చాటి చెప్పుకోవడం కోసమో ఏమో..? పురావస్తు శాఖ లేఖ మీడియాలో ప్రముఖంగా ప్రచారంలో కనిపించేసరికి అడ్డంగా నాలిక కరుచుకున్నారు.
ఇది ఆంధ్రాపై కేంద్రం కక్ష సాధింపుల కిందకి వచ్చే చర్య అనేది ముమ్మాటికీ అనిపిస్తోంది. ఎలాగూ నేరుగా టీటీడీపై కేంద్ర ఆధిపత్యం సాధం కాదు. కాబట్టి, పురావస్తు శాఖ ఉందిగా. దాన్ని ఇలా వినియోగించుకోవచ్చని భావించినట్టున్నారు. ఏదేమైనా, కుటిల రాజకీయాలను చేయడం కోసం కేంద్ర ప్రభుత్వమే తమ శాఖల్ని దురుద్దేశ పూరితంగా వాడుకోవడమనేది దారుణమైన విషయం. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వమూ ఇంత విచ్చలవిడిగా తమ వ్యక్తిగత కక్షలూ కార్పణ్యాలను తీర్చుకునేందుకు ఈ స్థాయి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ దాఖలాలు లేవు.