‘ఆహా’ ఓటీటీ వ్యూహం ఏమిటో గానీ వెబ్ సిరిస్ లకు కూడా రీమేకులపై ఆధారపడుతుంది. గతంలో ఆహాలో వచ్చిన #BFF రీమేక్ వెబ్ సిరిస్ నే. ఇప్పుడు మరో రీమేక్ వెబ్ సిరిస్ గా ‘అర్ధమయ్యిందా అరుణ్ కుమార్’ వచ్చింది. హిందీలో వచ్చిన ‘అఫీషియల్ చుక్యగిరి’ అనే యూట్యూబ్ సిరిస్ కి రీమేక్ ఇది. ఐదు ఎపిసోడ్ లు కలిపి మొదటి సీజన్ గా ఆహాలో విడుదలైయింది. మరి రీమేక్ చేసేటంత కంటెంట్ ఇందులో ఏముంది? తర్వాత సీజన్లపై అరుణ్ కుమార్ ఆసక్తి పెంచగలిగాడా?
అరుణ్ కుమార్ ముందా (హర్షిత్ రెడ్డి)ది అమలాపురం. చురుకైన కుర్రాడు. తనకి జీవితంలో చాలా కలలు వుంటాయి. సొంత ఊర్లో ఈసేవ లో పని చేస్తే 15వేల జీతంతో హాయిగా బ్రతకొచ్చని తండ్రి సలహా ఇస్తాడు. ఐతే జీవితంలో ఎన్నో కోరికలు వున్న అరుణ్ కుమార్.. తను కోరుకున్న జీవితం పొందాలంటే ఈసేవ లో పని చేస్తే కుదరదని భావించి ఎదో సాధించాలని హైదరాబాద్ వస్తాడు. ఓ స్టార్టప్ కంపెనీలో ఇంటర్న్‌గా చేరతాడు. తొలిరోజే ఆఫీస్ లో వింత అనుభవాలు ఎదురౌతాయి. తన ఇంటి పేరు ముందాని ‘డ’ శబ్దంతో పలికి హేళన చేస్తాడు అక్కడ టీం లీడ్ జై (జై ప్రవీణ్ ) కోపం వచ్చిన అరుణ్ .. జైని కూడా కూడా ఓ నాటు తిట్టు తిడతాడు. దీంతో అరుణ్ కుమార్ ని జైకి పీఎగా మార్చేశాడు బాస్. జై, అరుణ్ ని బానిసలా చూస్తూ అన్ని పనులకు వాడేస్తుంటాడు. అదే ఆఫీస్ లో షాలినీ(తేజస్వి మదివాడ) మరో ప్రాజెక్ట్ లీడ్ చేస్తుంటుంది. జై కి షాలికి అస్సలు పడదు. జై టీంలో అరుణ్ ని చూసిన షాలిని ఓ ఆట ఆడించి తన టీంలోకి తెచ్చుకుంటుంది. షాలిని టీంలోకి వచ్చిన అరుణ్ కుమార్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అదే ఆఫీస్ లో పని చేస్తున్న పల్లవి(అనన్య) తో అరుణ్ కుమార్ కి ఎలాంటి బంధం ఏర్పడింది? ఎన్నో కలలతో హైదరాబాద్ వచ్చిన అరుణ్ కుమార్ తన ప్రయాణంలో ఏం తెలుసుకున్నాడు? అనేది మిగతా కథ.
ఇంటర్న్ షిప్ లోని కష్టాలు చూపించే సిరిస్ ఇది. హిందీ ‘అఫీషియల్ చుక్యగిరి’కి యూట్యూబ్ లో మంచి వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు అదే కంటెంట్ ని యాధాతధంగా ‘అర్ధమయ్యిందా అరుణ్ కుమార్?’ లో చూపించారు. ఎంతలా జిరాక్స్ తీశారంటే.. హిందీ వెర్షన్ లో ప్రధాన పాత్ర పేరు స్పందన్ చుక్య. ఆ ఇంటి పేరు చుక్యకి ‘టి’ సౌండ్ చేరిస్తే హిందీలో ఓ అసభ్య పదం వస్తుంది. తెలుగులో కూడా అదే ఫాలో అవుతూ అరుణ్ కుమార్ ఇంటి పేరు ‘ముందా’ అని పెట్టారు. దీనికి ‘డ’ తగిలిస్తే ఏమొస్తుందో మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇందులో మొత్తం ఐదు ఎపిసోడ్స్ వున్నాయి. ఒకొక్క ఎపిసోడ్ .. ఒక డైలాగుతో మొదలౌతుంది. ఆ డైలాగు ఆ ఎపిసోడ్ లోని సారాంశంగా వుంటుంది. పెద్ద డ్రామా, ఎమోషన్ వున్న కంటెంట్ కాదిది. యూ ట్యూబ్ కి తగ్గటే నడుస్తుంది. అరుణ్ కుమార్ ని ఫాలో అవుతూ ఈ సిరిస్ చూడాలి. తన ఇంటర్న్ కష్టాలతో మొదటి ఎపిసోడ్ సరదాగా సాగిపోతుంది.
రెండో ఎపిసోడ్ లో షాలిని పాత్ర ప్రవేశించడమే ఇందులో మలుపు. ఐతే షాలిని పాత్రని తెలుగైజ్ చేయలేదనిపిస్తుంది. ఆమె ప్రవర్తన ఓ నార్త్ అమ్మాయిలానే వుంటుంది. (ఆహా అందించిన #BFF వెబ్ సిరిస్ లో కూడా ఇదే జరిగింది. పాత్రల్లో తెలుగు స్వభావం కనిపించలేదు) ఆమె ఎంత కఠినమైన మనిషంటే.. అరుణ్ తల్లి గుండెపోటుతో హాస్పిటల్ లో చికిత్సపొందుతున్న పరిస్థితిలో కూడా వెళ్లి కలవడానికి పర్మిషన్ ఇవ్వదు. పైగా డిటాచ్ మెంట్ వుండాలని సూక్తులు చెబుతుంది. ప్రాజెక్ట్ ముఖ్యమని ప్రభోదిస్తుంది. ఈ వెబ్ సిరిస్ లోని ప్రధాన సంఘర్షణ ఇదే. తన కలలు సాకారం కావాలంటే, కార్పోరేట్ ప్రపంచంలో పైకి రావాలంటే ఎమోషన్స్ నొక్కిపెట్టి ముందుకు వెళ్ళడమే అనే సంఘర్షణ అరుణ్ కుమార్ లో కనిపిస్తుంది.
ఇందులో ఓ ప్రేమకథ కూడా వుంటుంది. అమాయకంగా చలాకీగా మాట్లాడే అరుణ్ కుమార్ ని ఇష్టపడుతుంది పల్లవి. అయితే ఆ ప్రేమని మాత్రం బయటికి చెప్పదు. దానికి తగినట్లే ఈ ప్రేమకథ కూడా బయటికి కనిపించదు. ఈ సీజన్ కి ముగింపు కూడా మరీ అంత గుర్తుపెట్టుకునేలా వుండదు. ఆఫీస్ లో షాలిని టీమ్ స్త్రీ సాధికారత గురించి ఒక ప్రాజెక్ట్ చేస్తుంది. దానికి క్లయింట్ ని తీసుకురావడం మెయిన్ టాస్క్. ఐతే దాని చుట్టూ నడిపే సన్నివేశాలలో బలం వుండదు. అమ్మ, ల్యాప్ టాప్, స్త్రీ సాధికారత అంటూ ఇచ్చే ప్రజంటేషన్ కూడా అంత బలంగా వుండదు. దానిని క్రియేటివ్ గా ఎమోషనల్ గా ప్రజెంట్ చేసుంటే బావుండేది.
అరుణ్ కుమార్ పాత్రలో చక్కగా కుదిరాడు హర్షిత్ రెడ్డి. తన నటన సహజంగా వుంది. డైలాగు చెపే విధానం కూడా బావుంది. జై ప్రవీణ్ టీం లీడ్ గా కనిపించాడు. షాలిని పాత్రలో కనిపించిన తేజస్వి కఠినమైన బాస్ గా కనిపించింది. ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానంలో నార్త్ ప్రభావం కనిపించింది. పల్లవి పాత్రలో చేసిన అనన్య శర్మ పాత్ర పై పెద్దగా ద్రుష్టిపెట్టలేదు. దీంతో ఆ లవ్ స్టొరీ సైడ్ ట్రాక్ లానే వుంటుంది. అన్నట్టు ఇందులో అభినవ్ గోమతం కూడా వున్నాడు. డ్రోన్ కెమరా రూపంలో. తనే కంపెనీ బాస్. కేవలం డ్రోన్ కెమరాలో వచ్చి టీంని చూస్తుంటాడు. చివరి ఎపిసోడ్ లో మాత్రం కనిపిస్తాడు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
జోనాథన్ ఎడ్వర్డ్స్ ఈ సిరిస్ కి దర్శకుడు. డైలాగులతో సహా హిందీ వెర్షన్ ని ఫాలో అయిపోయాడు. ఐతే తెలుగు డైలాగులు కొన్ని లైవ్లీ గా రాశారు. బలమైన సన్నివేశాలు లేకపోయినా డైలాగులతో లాగించే ప్రయత్నం చేశారు. సౌండ్, కెమరాపనితనం, నిర్మాణ విలువలు ఓటీటీకి తగ్గట్టే వున్నాయి.
చిన్న కంటెంట్ ఇది. యూట్యూబ్ ఫ్రీ స్ట్రీమింగ్ కాబట్టి చూసేవారికి ఏం అంచనాలు వుండవు. కానీ ఆహా సబ్ స్క్రిప్షన్ కి ఒక ధర వుంది. దానికి తగిన కంటెంట్ ని బిల్డప్ చేయడానికి ప్రయత్నించాలి. ఒరిజినల్ కంటెంట్ పై ద్రుష్టి పెట్టాలి. ఒక సిరిస్ రిలీజ్ చేస్తే ఆహా కి ఒక ఇమేజ్, బ్రాండ్ తెచ్చేలా వుండాలి తప్పితే ఎదో ఒక కొత్త సిరిస్ విడుదల చేశామని ఆనందపడటంలో పెద్ద ప్రభావం, ప్రయోజనం వుండవు.