హైదరాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాలలో ఇటీవల ఎన్.ఐ.ఏ. అధికారులు కొందరు ఐసిస్ ఉగ్రవాదులని అరెస్ట్ చేసిన తరువాత దేశంలో నగరాలలో భద్రత డొల్లతనం కళ్ళకి కట్టినట్లు కనబడుతోంది. అంతకు ముందు చాలా కాలం నుంచి నగర పోలీసులు పాతబస్తీ, జంట నగరాలలో పలుప్రాంతలలో తరచూ కార్బన్ సర్చ్ నిర్వహిస్తున్నప్పటికీ ఈ భయంకరమైన కుట్రని కనుగొనలేకపోయారు. అందుకు అవసరమైన సమాచారం, శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వారివద్ద లేనందునే కనుగొనలేకపోయారని సర్ది చెప్పుకొన్నప్పటికీ, నగరం నడిబొడ్డున భారీ మారణాయుధాలతో ఒకేసారి అంతమంది ఉగ్రవాదులు పట్టుబడటం అందరినీ దిగ్బ్రాంతి కలిగించింది.
ఆ తరువాత నుంచి నగర పోలీసులు తరచూ కార్బన్ సర్చ్ నిర్వహిస్తూనే ఉన్నారు. వారి గాలింపులో బయటపడుతున్న విషయాలు చూస్తే, మన మధ్యనే ఎన్ని అసంఘీక శక్తులు తిష్ట వేసుకొని ఉన్నాయో అర్ధం అవుతోంది. ద్విచక్ర వాహనాల దొంగలు, మాదకద్రవ్యాల దళారులు, వ్యాపారులు, ఇళ్ళని దోచుకొనే దొంగలు కార్బన్ సర్చ్ లో పట్టుబడుతున్నారు. వారివద్ద నుంచి సెల్ ఫోన్లు, బైకులు, మత్తు మందులు, లిక్కర్ బాటిల్స్ వంటివి దొరుకుతున్నాయి. పట్టుబడిన వారిలో చాల మందికి ఎటువంటి గుర్తింపు కార్డులు లేకుండానే అద్దెలకి ఉంటున్నట్లు పోలీసులు కనుగొన్నారు. వారు కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా వంటి దేశాల నుంచి అక్రమంగా వచ్చి స్థిరపడినవారు కూడా పట్టుబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇది కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం అని నిర్లక్ష్యం చేయడానికి లేదు. హైదరాబాద్ పై నిఘా పెరిగితే అప్పుడు సంఘవిద్రోహక శక్తులు పొరుగునే ఉన్న ఏపిలోకి మారే అవకాశం ఉంటుంది. ప్రశాంతమైన నగరంగా పేరొందిన విశాఖలో గత కొద్దికాలంగా కిడ్నాపులు, హత్యలు, దొంగతనాల సంఖ్య పెరుగుతుండటం చూస్తే, సంఘ విద్రోహక శక్తులు ఇప్పటికే విశాఖకి కూడా విస్తరించినట్లు అర్ధమవుతోంది. వారు మాత్రమే కాకుండా హైదరాబాద్ లో పట్టుబడిన ఐసిస్ ఉగ్రవాదులు శరవేగంగా ఎదుగుతున్న విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాలకి వ్యాపించ(లే)రా? వ్యాపిస్తే వారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర పోలీస్ సిద్ధంగా ఉందా? అనే సందేహాలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి.
కనుక ఏపి పోలీస్ కూడా అనుమానిత ప్రాంతాలలో తరచూ కార్బన్ సర్చ్ లు నిర్వహించడం, బయట వ్యక్తుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకి వివరించి చైతన్యపరచడం చాలా అవసరం. అలాగే సిసి కెమెరాలు, అత్యాధునిక సమాచార వ్యవస్థ, ఉగ్రవాదులని, అసాంఘీక శక్తులని, వారి కుట్రల్ని గుర్తించడానికి వీలుగా ప్రత్యేక బృందాల ఏర్పాటు, వాటికి ప్రత్యేక శిక్షణ వంటి ఏర్పాట్లన్నీ ముందే చేసుకోవడం చాలా మంచిది. హైదరాబాద్ లోనో కాశ్మీరులోనో లేదా ఫ్రాన్స్ లోనో జరుగుతున్న సంఘటనలు మన వద్ద ఎన్నడూ జరుగవని నిశ్చింతగా కూర్చొంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లవుతుంది.