విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఏపీ రాజ్యసభ సీటును బీజేపీకి ఇస్తున్నారు. బీజేపీ నుంచి అన్నామలై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తమిళనాడులో రాజ్యసభ సీటు గెలుచుకునేంత పరిస్థితి బీజేపీకి లేదు. అన్నాడీఎంకేతో పొత్తు కోసం అన్నామలైను బలి చేశారు. ఇప్పుడు ఆయనకు సాంత్వన చేకూర్చాలంటే రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేయాలి. అందుకే అన్నామలై పేరును ప్రచారంలోకి తెచ్చారు.
ఏపీలో కూటమి పేరుతో బలం లేకపోయినా బీజేపీ పదవులను దాదాపుగా లాక్కున్నంత పని చేస్తోంది. అలా చేసినా తెలుగువారికి కాకుండా తమ జాతీయ అవసరాలకు ఇతర రాష్ట్రాల వారిని తీసుకొచ్చి డంప్ చేస్తోంది. ఇప్పటికే ఆర్.కృష్ణయ్య అనే తెలంగాణ పెద్ద మనిషిని ఏపీ మీదకి రుద్దారు. ఆయనకు ఏపీ అంశాల మీద మాట్లాడే తీరిక ఉండదు. వైసీపీ ఇప్పటికే రిలయన్స్ కు ఓ సీటు అమ్ముకుంది. పరిమళ్ నత్వానీ అనే పెద్ద మనిషి బీజేపీతో కలిసిపోయి వైసీపీ ఎంపీగా తిరుగుతూ ఉంటారు. ఏపీ గురించి ఆయన ఎప్పుడైనా మాట్లాడితే ఎవరైనా చూడాలని అనుకుంటారు. కానీ ఆయన ఎప్పుడూ మాట్లాడిన పాపాన పోలేదు.
ఇక వైసీపీ నుంచి తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డి అనే ఎంపీ ఉన్నారు. ఆయనకు జగన్ లాయర్ ఫీజుగా రాజ్యసభ పదవి ఇచ్చారు. ఆయన కోర్టుల చుట్టూ తిరిగి వాదించడానికే సరిపోతుంది. రాజ్యసభ సభ్యుడు అనేది ఆయన వాదనలకు బలంగా ఉండేలా పదవి అనుకోవడమే. ఇప్పుడు మరో సీటును ఇతర రాష్ట్రాల వారికి ఇస్తే.. తెలుగు వారికి అన్యాయం చేసినట్లే.