లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం పెద్ద కష్టమేమి కాదని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తుండగా…వీటిపై ఎన్నికల అధికారులు మాత్రం పెద్దగా స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
ఇప్పటివరకు ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్ లను 31 దేశాలు పాక్షికంగా, పూర్తిగా పక్కనపెట్టేశాయి. ట్యాంపరింగ్ , హ్యాకింగ్ అనుమానాలతో ఈవీఎంలకు స్వస్తి పలికారు. ఇండియాలో రూపొందించిన ఈవీఎంలను బోట్స్ వానాలో వినియోగించగా అధికార పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చేలా వీటిని తయారు చేశారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఫ్రాన్స్, జర్మనీ , జపాన్, యూకే, ఐర్లాండ్, కెనడా, సింగపూర్,బంగ్లాదేశ్ ఫిన్లాండ్ వంటి దేశాల్లో ఈవీఎంలకు స్వస్తి పలికారు. కానీ, మన దేశంలో మాత్రం పెద్దఎత్తున ఆరోపణలు వస్తోన్న ఈవీఎంలతోనే ఎన్నికల నిర్వహణకు సిద్ద పడుతుండటం గమనార్హం.
ఈవీఎంలపై అనుమానంతో హ్యాకింగ్ ఎక్స్పర్ట్ హరిప్రసాద్ , అమెరికాకు చెందిన సైబర్ నిపుణుడు అలెక్స్, నెదర్లాండ్ కు చెందిన రోప్ తో కలిసి ప్రయోగాలు చేశారు. ఈ ఓటింగ్ మిషన్ ను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో వీడియో తీసి చూపించారు. ఇలా ఈజీగా ఈవీఎంలు ట్యాంపరింగ్ గురి కావడంపై చర్యలు చేపట్టకుండా ప్రసాద్ అరెస్ట్ కు ఆదేశాలు అందటం చర్చనీయాంశం అయింది. అలాగే, మధ్యప్రదేశ్ లో ఓటర్ల అవహగన సదస్సులో ఈవీఎంలో ఏ మీటా మీద నొక్కినా బీజేపీకి ఓటు పడేలా స్లిప్పులు రావడం సంచలనం అయింది. దీంతో ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఈవీఎంలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికలు జరిగే ప్రతిసారి మోడీ ఎందుకు అధికారంలోకి వస్తున్నారని.. కారణం ఈవీఎంలేనని ఆరోపించారు. బ్యాలెట్ పేపర్ పై ఎన్నికలు నిర్వహించకుండా ఎందుకు ఈవీఎంలతో నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈవీఎంల పనితీరుపై సందేహాలు వస్తున్నా ఎన్నికల అధికారులు మాత్రం కిమ్మనకుండా ఉండటం చర్చనీయాంశం అవుతోంది.