బిహార్ ఎన్నికల ప్రచారఘట్టం గమనిస్తూ, ఆ పార్టీ నేతల కబుర్లు వింటుంటే స్వర్గలోకంలో ఉన్న దేవతలంతా ఆ పార్టీకి చెందినవారేనేమో- అని అనుకోవచ్చు. అంత ధాటిగా కబుర్లు చెప్పడంలో వారికివారే ఘనాపాఠీలు. హిందువుల పండుగలు, పబ్బాలు, దేవతలు, స్వామీజీలు, బాబాలు అంతా తమవైపే ఉన్నారన్నట్టుగా ఈ కాషాయ వర్గీయులు మైకులముందు ప్రవచనాలు ఇస్తున్నారు. తమ పార్టీ గెలవకపోతే బిహార్ లో ఉగ్రవాద, తీవ్రవాద ముష్కరులు రాజ్యమేలతారని భయపెట్టేస్తున్నారు.
బిహార్ లో నిర్దేశించిన ఐదు విడతల పోలింగ్ లో ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తయింది. మొదటి రెండు విడతలు (అక్టోబర్ 12, 16తేదీల్లో) పోలింగ్ పూర్తయ్యాక మధ్యలో పండగ సీజన్ రావడంతో మూడవ దశకు బాగానే గ్యాప్ వచ్చింది. మొదటి రెండు దశల పోలింగ్ సరళి బీజేపీని క్రుంగదీసిందనే చెప్పాలి. దీంతో ఈ పండుగ సీజన్ ను పార్టీ నేతలు హిందూఓట్లను దండుకోవడానికి బాగానే ఉపయోగించుకున్నారు. హిందూదేవతలను, పండుగలను అన్నింటినీ ప్రచారానికి లాక్కొచ్చిపడేశారు. మూడవ విడత నుంచీ పోలింగ్ తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం తెగ తాపత్రయపడ్డారు. ఎంతవరకు సఫలీకృతులయ్యారో ఇప్పుడు చెప్పలేం.
ఈ పండుగ సీజన్ లోనే ప్రధాని నరేంద్ర మోదీ విజయదశమిరోజున ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా వెళ్ళినా ఆయన మనసంతా బిహార్ మీదనే ఉన్నదని చెప్పుకుంటున్నారు. మోదీ ఆవేళ ఏపీకి స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తారనీ ముఖ్యమంత్రిసహా చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరి ఆశలపై మోదీ గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు జల్లారు. దీనిపై తెలుగుదేశం పార్టీకే చెందిన ఒక ఢిల్లీ నాయకుడు ఛలోక్తిగా – ` ప్రధాని మన స్పృహలో లేరు, ఆయన శ్వాస,ధ్యాస అంతా బిహార్‌లోనే ఉన్నది, అందుకే ఆయన మట్టి, నీళ్లు మాత్రమే ఇచ్చివెళ్ళారు, లేకుంటే ప్యాకేజీ ప్రకటించేవారే’ అంటూ తనమనసులేని మాటని జోక్ గా బయటబెట్టారు.
బిహార్ లో ప్రస్తుత ప్రచార శైలి గమనిస్తుంటే, మోదీ గురించి ఆమాత్రం ఛలోక్తి విసరడం సరైనదేననిపిస్తోంది. ఉన్నమాట చెప్పుకోవాలంటే, మోదీనేకాదు, బిజీపీ అధ్యక్షుడు అమిత్ షా ఇతర నాయకగణం కంటిమీద కునుకులేకుండా బిహార్ ఎన్నికలను సాక్షాత్తు మహాసంగ్రామం అన్నట్లు ఫీలైపోతున్నారు. బిహార్ ఎన్నికల్లో గెలిస్తే రాజ్యసభలో కొంతలోకొంత అనుకూల వాతావరణాన్ని మెరుగుపరుచుకోవచ్చన్నమాట నిజమే. అలాగే, వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాలో రాబోయే ఎన్నికల్లో దీని ఫలితం ప్రభావం చూపించవచ్చు. కేవలం ఈ తరహా ప్రయోజనాల కోసం బిహార్ ను కురుక్షేత్ర సంగ్రామంలా భావిస్తోంది బీజేపీ. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే మోదీ అక్కడకు వెళ్ళి, ప్రజలు అడిగినా, అడక్కపోయినా భారీ ప్యాకేజీ (లక్షా పాతిక వేల కోట్ల రూపాయలు) ప్రకటించి అందరూ విస్తుపోయేలా చేశారు. దీంతో మోదీ అంటే దానకర్ణుడన్న అభిప్రాయం ఎవరికైనా కలిగిఉంటే అది శుద్ధ తప్పని ఆంధ్రాలో మొన్నటి మోదీ ప్రకటన చాలా స్పష్టంగా తేల్చిపారేసింది.
బిహార్ లో ఇంకా రెండు విడతల పోలింగ్ మాత్రమే మిగిలిఉంది. నవంబర్ 1 (ఆదివారం) నాలుగవ విడత, ఆ తర్వాత నవంబర్ 5వ తేదీన ఆఖరి విడత పోలింగ్ జరగాల్సిఉంది. కాగా, దీపావళికి కొద్దిరోజుల ముందు అంటే, నవంబర్ 8న ఫలితాలు వెల్లడవుతాయి. బిహార్ ఎన్నికలు జరుగుతుండగానే పెద్ద పండుగ (దసరా) రావడం, ఫలితాలు వెల్లడైన కొద్ది రోజులకే దీపావళి వస్తుండటంతో బిజేపీ నాయకులు రావణాసురుడ్ని, రాముడ్ని, నరకాసురుడ్ని , శ్రీకృష్ణుడిని తమ ప్రసంగాల్లో తీసుకువస్తున్నారు. అంతేనా అంటే ఈ లిస్ట్ చాంతాడంత ఉంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే లవకుశులను, అశోక చక్రవర్తిని లాక్కొచ్చిన ఘనత కూడా బీజేపీదే.
ఇప్పుడు తాజాగా, బిజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఒక ర్యాలీలో మాట్లాడుతూ, బిహార్ లో మహాకూటమి కనుక గెలిస్తే, పాకిస్తాన్ లో ముష్కర మూకలు బాణసంచా పేలుస్తూ దీపావళి జరుపుకుంటారనీ, ఎందుకంటే మహాకూటమి కనుక అధికారంలోకి వస్తే, బిహార్ రాష్ట్రం ఉగ్రవాదులపాలిట స్వర్గధామం అవుతుందన్న సంగతి వారికి తెలుసని వ్యాఖ్యానించారు.
మొత్తానికి బీజేపీ ఎలాగైనా ఈ ఎన్నికల్లో నెగ్గి తన పరువుకాపాడుకోవాలనుకుంటున్నది. ఇందుకోసం ఎవ్వరినైనా ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటుంది. అయితే ఓటర్లు మాత్రం ఈ సీన్లన్నీ మౌనంగా చూస్తున్నారు. తమ తీర్పును ఒకపక్క ఇచ్చేస్తున్నారు. ఇక ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
– కణ్వస