ఒకప్పుడు పద్మా అవార్డులు అందుకోవడం అందరూ చాలా ప్రతిష్టాత్మకంగా భావించేవారు. ఇప్పుడు కూడా భావిస్తూనే ఉన్నారు. కానీ వాటికి కూడా రాజకీయ మకిలి అంటుకోవడం మొదలయినప్పటి నుండి వాటి ప్రతిష్ట కొంత మసకబారిందనే చెప్పవచ్చును. వ్యక్తుల నైపుణ్యం లేదా వారు సమాజానికి చేసిన సేవలను కొలమానంగా కాక, వారికి రాజకీయ నాయకులతో గల పరిచయాలు, పలుకుబడి కారణంగానే ఈ అవార్డుల పంపకాలు జరుగుతుండటం వలన వాటి ప్రతిష్టని మసకబార్చాయని చెప్పవచ్చును. అది కాకుండా అధికారంలో ఉన్న పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, తమకు లబ్ది కలిగించగలరని ఆశతోనో, ఆలోచనతోనో వ్యక్తులను ఈ పురస్కారాలకు ఎంపిక చేయడం వలన కూడా ఈ ప్రతిష్టాత్మకమయిన పద్మా అవార్డుల ప్రతిష్ట కొంత మసకబారిందని చెప్పవచ్చును.
ఈరోజు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డుకు ఎంపికయిన వారిలో ఒక ప్రముఖుడు గత ఏడాదిన్నర కాలంగా ప్రధాని నరేంద్ర మోడి చుట్టూ తిరుగుతూ ఆయనని ప్రసన్నం చేసుకోగలిగారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఆ వ్యక్తి వలన ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంయిన పరిస్థితులు ఎదుర్కోవడం వలన అతనిని ఇటువంటి ప్రతిష్టాత్మకమయిన అవార్డులకు ఎన్నడూ ఎంపిక చేసే ఆలోచన కూడా చేయలేదు. కానీ కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు మారడం, వాటితో ప్రభుత్వ ఆలోచనలు, విధానాలు కూడా మారడం, రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు వగైరాలన్నీ సదరు వ్యక్తికి బాగా కలిసివచ్చేయి. వాటిని చాలా చక్కగా వినియోగించుకోగలగడంతో పద్మా అవార్డుల జాబితాలో ఆయన పేరు కూడా ఎక్కింది. అంటే ఈ అవార్డు అందుకోవడానికి ఒక ప్రభుత్వానికి అనర్హుడుగా కనబడిని వ్యక్తి ప్రభుత్వం మారగానే అర్హుడిగా మారిపోయారన్నమాట.
అలాగే తమిళనాడులో ఒక ప్రముఖుడికి ఈ ప్రతిష్టాత్మకమయిన ఈ అవార్డుని ప్రకటించారు. నిజానికి ఆ వ్యక్తికి ఇటువంటి అవార్డు చాలా కాలం క్రితమే ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ఆయన ఇంతకంటే ఇంకా గొప్ప అవార్డు అందుకోవడానికి కూడా అన్ని విధాల అర్హుడు. కానీ గత ప్రభుత్వం ఆయనని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. అలాగే అన్ని పార్టీలకి కూడా ఆయన సమానదూరం పాటించేవారు. కనుక ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అయన ఎవరికీ అక్కరలేని వాడయ్యాడు. కానీ తమిళనాడు రాష్ట్ర ప్రజలు మాత్రం ఆయనని దేవుడిగా పూజిస్తారు. దాని ముందు ఇప్పుడు ఆయన అందుకోబోయే ఈ పద్మా అవార్డు చాలా చిన్నదేనని చెప్పక తప్పదు. కానీ ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలున్నాయి కనుక ఒకవేళ అమ్మ దయతప్పితే ఆయన దయ ఉన్నా చాలు ఒడ్డునపడవచ్చనే ఆశతో ఈసారి ఆయన పేరుని జాబితాలో చేర్చి ఉండవచ్చును. లేకుంటే ఆయనకీ ఏనాడో ఇంతకంటే చాలా గొప్ప అవార్డే ఇచ్చి ఉండాలి.
ఈ చిన్న చిన్న ఉదాహరణలను బట్టి ఈ అవార్డులను ఏవిధంగా పొందవచ్చో లేదా ఇవ్వబడతాయో అర్ధం చేసుకోవచ్చును. అందుకే వాటి ప్రతిష్ట నానాటికీ మసకబారిపోతోంది. ఏమయినప్పటికీ ప్రతిష్టాత్మకమయిన ఈ అవార్డులను ఏదో విధంగా అందుకోవడం నేటికీ చాలా మంది గొప్పగానే భావిస్తున్నారు కనుకనే ఇంకా వాటికి అంత డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది. అందుకే తెర వెనుక ఇటువంటివన్నీ నడుస్తుంటాయి.