ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులను కరోనా సహాయ చర్యల కోసం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లుగా గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. సొంత సొమ్మును వీరు విరాళంగా ఇచ్చేస్తున్నట్లుగా చేస్తున్న ప్రకటనలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని .. తన ఎంపీ ల్యాడ్స్ నిధులను రూ. ఐదు కోట్లు కరోనా కోసం మంజూరు చేస్తానని ప్రతిపాదనలు పంపాలని.. కలెక్టర్లకు సూచించారు. దాన్ని విరాళంగా ఆయన చెప్పుకోలేదు. అయితే.. ఆ తర్వాత నితిన్ లాంటి కొంత మంది సినీ నటులు… విరాళం ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీ ఎంపీలు… ఎమ్మెల్యేలు.. తమ జీతాల్ని విరాళంగా ప్రకటించారు. అది జీతం కాబట్టి.. విరాళం అనుకోవచ్చు.
ఆ తర్వాత ఎంపీలు.. తమ ఎంపీ ల్యాడ్స్ నిధులను విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించడం ప్రారంభించారు. ఎంపీ ల్యాడ్స్.. వారి సొంతానివి కావు. ప్రజాధనమే.. ప్రజల కోసమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటివి ఇప్పటి వరకూ ఖర్చు పెట్టకుండా.. వాటిని.. సీఎం రిలీఫ్ పండ్‌కు… కొంచెం.. పీఎం రిలీఫ్ ఫండ్‌కు కొంచెం ఇచ్చేసి.. విరాళం అనేస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్.. తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. రెండు కోట్లను ఇస్తున్నట్లుగా ప్రకటించారు. వారు విరాళం అని చెబుతున్నారో లేదో కానీ.. మీడియా మాత్రం.. విరాళం అని చెప్పేస్తోంది. దాంతో వారి జేబులో సొమ్మేదో ఇచ్చేస్తున్నారన్న ఫీలింగ్ కలుగుతోంది.
సినిమా తారలు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు కానీ.. ఇంత వరకూ.. రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన ఏ ఒక్క పారిశ్రామికవేత్త కూడా.. తమ జేబులో నుంచి ఒక్కటంటే.. ఒక్క రూపాయి కూడా విరాళం ప్రకటించలేదు. పార్టీల ఒత్తిడి మేరకు ఒకటి లేదా రెండు నెలల జీతం ఇస్తామని ప్రకటించారు తప్ప.. అదనంగా పైసా కూడా.. ఇవ్వలేదు. కానీ.. వారేదో పెద్ద దానకర్ణులులాగా ప్రచారం చేసుకోవడానికి మాత్రం వెనుకాడటం లేదు. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును.. కోట్లకు కోట్లు విరాళాలుగా ప్రకటిస్తుంది సినీ తారలే. రాజకీయ నేతలు కాదు..!