ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో గతంలో ఓ లక్షణం ఉండేది.. అదేమిటంటే ఎవరి శాఖపై వారే మాట్లాడాలన్న రూల్ ఉండేది కాదు. ఎవరికి తోచితే వారు మాట్లాడేవారు. అయితే అలా అనిపిస్తుంది కానీ వైసీపీ కేంద్ర కార్యలయంలో సజ్జల టీం ఫలానా అంశంపై ఏం మాట్లాడాలో ఖరారు చేసి.. కుల సమీకరణాలు వేసి.. ఏ మంత్రి మాట్లాడాలో ఖరారు చేస్తుంది. ఆ దిశగా ఆ మంత్రిగా సంకేతాలు .. స్పీచ్ సందేశాలు వెళ్తాయి. పార్టీ పరంగానే కాదు.. అధికారికమైన అంశాల్లోనూ ఇదే పద్దతి. మంత్రులు బహిరంగంగా మాట్లాడితే అది రాజకీయం తప్ప అధికారికంగా కాదనేది వైసీపీ సిద్ధాంతం. అందుకే ఎవరి విశాఖ వారు వారే మాట్లాడాలన్న రూల్ లేదు.
అందుకే గత మంత్రివర్గంలో ఎవరు ఏ శాఖకు మంత్రే చటుక్కున చెప్పలేని పరిస్థితి మీడియా సర్కిల్స్‌లోనే ఉంటుంది. కొత్త మంత్రులు వచ్చిన తర్వాతైనా సీన్ మారుతుందేమో అనుకున్నారు. కానీ అలాంటివేమీ లేదు. అన్నీ విషయాలను ఇద్దరు ముగ్గురు మంత్రులు మాత్రమే చెబుతున్నారు. రోజా, అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి వారు తరచూ మీడియా ముందుకు వచ్చి అన్ని శాఖలపైనా మాట్లాడుతున్నారు. దీంతో వీరు ఏ శాఖలకు మంత్రి అన్న డౌట్ అందరికీ వస్తోంది.
మరో వైపు కొంత మంది మంత్రులు అవగాహన లేకుండా చేస్తున్న ప్రకటనలతో వైసీపీ పెద్దలకు ఆగ్రహం వస్తోంది. తాము సూచనలు ఇవ్వకుండా మీడియాతో మాట్లాడవద్దని నేరుగా తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. కొంత మంది మంత్రులు సోషల్ మీడియాలో విపరీతంగా హైప్ చేసుకున్నారు కానీ వారు నోరు తెలిస్తే అజ్ఞానం అంతా బయటపడుతోంది. పబ్లిసిటీ కోసం తనిఖీలులాంటివి చేస్తూంటే లోపాలన్నీ బయటపడుతున్నాయి. దీంతో మీడియాలో నెగెటివ్ ప్రచారం జరుగుతుందని.. అలాంటివి కూడా వద్దని వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా తెలుస్తోంది.
మొత్తంగా పాత మంత్రివర్గమే బెటర్ అన్నట్లుగా కొత్త మంత్రివర్గం ఏర్పాటు తర్వాత పరిణామాలు చోటు చేసుకోవడం వైసీపీ నేతలకూ మింగుడు పడటం లేదు. గతంలో మంత్రులు మాట్లాడితే… కొడాలి నాని, పేర్ని నాని వంటి వారు మాట్లాడినట్లుగా హైప్ రావడం లేదని.. తేలికగా తీసుకుంటున్నారని బాధపడుతున్నారు. ఎలా చూసినా.. కొత్త మంత్రివర్గంతో ఏం సాధించాలనుకున్నారో అది మాత్రం చాలా దూరంగా జరిగిపోయిందని వైసీపీ క్యాడర్ నిరాశకు గురవుతున్నారు.