బాలకృష్ణ కోసం హీరోలు విలన్స్ గా మారుతున్నారు. లెజెండ్ లో జగపతి బాబు విలనీ అద్భుతంగా పడింది. అఖండలో శ్రీకాంత్ కూడా కొత్తగా కనిపించారు. ఇప్పుడు హీరో అర్జున్, బాలయ్యకి విలన్ గా మారుతున్నారు. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న లో సినిమా విలన్ గా అర్జున్ అనుకుంటున్నారు. ఈ మేరకు సంప్రదింపులు జరపడం, ఆయన ఓకే అనడం జరిగింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తారు.
బాలకృష్ణ- అర్జున్.. దాదాపు ఒకే సమయంలో వచ్చిన హీరోలు. ఇద్దరికీ మొదటి హిట్ పడింది భార్గవ ఆర్ట్స్ బ్యానర్ లోనే. మా పల్లెలో గోపాలుడు తో అర్జున్ హిట్ కొడితే, మంగమ్మగారి మనవడుతో బాలయ్య విజయం సాధించారు. ఇద్దరి సినిమాలకి కోడి రామకృష్ణనే దర్శకుడు. తెలుగు బాలయ్య చేసిన నరసింహనాయుడు సినిమాని అర్జున్ తమిళ్ లో రిమేక్ చేసి హిట్ కొట్టారు. జగపతి బాబు, శ్రీకాంత్ లతో పోల్చుకుంటే.. బాలయ్యకు అర్జున్ సమవుజ్జీ. ఇలాంటి కాంబినేషన్ సెట్ కావడంతో తెరపై కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి నెలకొంది.