కరోనా వైరస్‌కు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల దగ్గర్నుంచి భారతీయ జనతా పార్టీ నేతల వరకూ..అందరూ.. మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. సైంటిస్టులు ఇంకా కుస్తీలు పడుతున్నారు కానీ.. భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం.. చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. ఒకరు హనుమాన్ చాలీసా చదవాలంటారు.. మరొకరు గోమూత్రం తాగాలంటారు.. ఇంకొకాయన .. కరోనాను తరిమికొట్టే అప్పడాలు అంటూ… రిలీజ్ చేసేశారు. ఆ అప్పడాలు తింటే కరోనా పారిపోతుందని కూడా సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. వీరందరూ సాదాసీదా బీజేపీ కార్యకర్తలు కాదు.. ఎంపీలు.. కేంద్రమంత్రులు. ఇలా కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ “అప్పడం వ్యాక్సిన్”ను కొద్ది రోజుల కిందట విడుదల చేశారు. ఓ అప్పడంను చటుక్కున విరుచుకుని తిని.. ఇక తనకు కరోనా రాదన్నట్లుగా కలరింగ్ ఇచ్చారు.
ఆయన కరోనా అప్పడాల అమ్మకాలు పెరిగాయో లేదో కానీ… ఇప్పుడు ఆయనకే కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. కరోనా లక్షణాలు కనిపించటంతో ఆయన టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. తనని కాంటాక్ట్ అయిన వారంతా టెస్టులు చేయించుకోవాలని మంత్రి సూచించారు. ఈ విషయం బయటకు తెలిసిన వెంటనే.. సహజంగానే ఆయనపై సెటైర్లు ప్రారంభమవుతాయి. అయ్యాయి కూడా. సోషల్ మీడియాలో ఇప్పుడీ అప్పడాల మంత్రి ట్రెండింగ్.
కరోనాను మార్కెట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. ప్రజల్ని భయపెట్టి.. తమ వస్తువులు వాడితే… కరోనాను తరిమికొట్టవచ్చని ప్రోత్సహిస్తున్నారు. చివరికి… పతంజలి బాబా రామ్ దేవ్ కూడా.. ఈ వ్యాపారంలోకి వచ్చారు. పెద్ద ఎత్తున కరోనిల్ అమ్ముతున్నామని చెబుతున్నారు. ఇదేదో బాగుందని బీజేపీ నేతలు… అప్పడాల దాకా వచ్చేశారు. అది వారితో.. వారికి సంబంధించిన వారిదో కానీ మార్కెటింగ్ కోసం.. తమ తెలివితేటలనంతా ప్రదర్శించేసి.. నవ్వుల పాలవుతున్నారు. అంతకూ.. ఆయన ప్రపంచానికి పరియచం చేసిన కరోనా అప్పడాల బ్రాండ్ ఏమిటో తెలుసా..” బాబ్జీ”