బాహుబలి కోసం రాజమౌళి సృష్టించిన పాత్రల్లో శివగామి అత్యంత శక్తిమంతమైనది. బాహుబలి కథకు మూలస్థంభం ఆ పాత్రే. అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్ర కాబట్టి…. ‘శివగామి’పై ఓ పుస్తకమే వచ్చింది. శివగామి పుట్టు పూర్వోత్తరాలు, ఆమె బాల్యం, ఎదిగిన విధానం.. ఇవన్నీ ఆ పుస్తకంలో పొందుపరిచారు రచయిత ఆనంద్ నీలకంఠన్. ఇప్పుడు ఈ పుస్తకాన్ని వెబ్ సిరీస్‌గా రూపొందించనుంది ఆర్కా మీడియా. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య చిత్రాలు తెరకెక్కించిన దేవాకట్టాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ప్రస్తుతం శివగామి పాత్రధారి కోసం అన్వేషణ జరుగుతోంది. శివగామి దొరికిన వెంటనే ఈ వెబ్ సిరీస్ మొదలు పెడతారని తెలుస్తోంది. దాదాపు 14 వారాల పాటు ఈ వెబ్ సిరీస్ టెలీకాస్ట్ అవ్వబోతోందట. ఒకవేళ ‘శివగామి’ వెబ్ సిరీస్ క్లిక్ అయితే.. అప్పుడు ‘బాహుబలి’లోని మిగిలిన పాత్రలపై కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.