రిపబ్లిక్ టీవీ ఓనర్ కం జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి వ్యవహారం ఇప్పుడు.. మీడియా వర్గాల్లో పెను సంచలనంగా మారుతోంది. టీఆర్పీలను మార్ఫింగ్ చేసిన స్కాంపై జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో కొన్ని పత్రాలు.. వాట్సాప్ చాట్లు బయటకు వచ్చాయి. బార్క్ రేటింగ్ అధికారులను ఆర్నాబ్ గోస్వామి ఎలా మభ్య పుచ్చారో తెలిపే ఆ చాట్స్ పత్రాలు ఉన్నాయి. అవసరం అయితే.. పీఎంవోతో చెప్పి సాయం చేస్తానని కూడా వాటిలో బార్క్ అధికారులకు ఆర్నాబ్ హామీ ఇచ్చినట్లుగా ఉంది. మంత్రులంతా మనవైపే ఉన్నారని భయపడాల్సిన పని లేదని కూడా ఆయన భరోసా ఇచ్చారు.
టీవీ చానళ్ల రేటింగ్స్ విషయంలో రిపబ్లిక్ టీవీకి అనూహ్యమైన ఎదుగుదల కనిపించేది. ఇతర అగ్ర చానళ్లకు… రేటింగ్ తక్కువగా వచ్చేది. అలాగే… బార్క్ లోని రేటింగ్ నిర్ణయించే అధికారులు.. ఒక్క రిపబ్లిక్ టీవీ విషయంలోనే కాదు.. రీజినల్ చానళ్ల విషయంలోనూ… కొన్నిఇతర చానళ్ల యాజమాన్యాలతో కలిసి కుట్ర పూరితంగా రేటింగ్స్ తగ్గించడం లేదా.. పోటీ చానళ్లకు పెంచడం లాంటి అక్రమాలకు పాల్పడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం టీఆర్పీ స్కామ్‌ను సీరియస్‌గా తీసుకోవడంతో ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంది. దీంతో… మీడియా వర్గాల్లో పెను సంచలనంగా నమోదవుతోంది.
తెలుగులోనూ టీఆర్పీ స్కాం జాడలు కనిపిస్తున్నాయి. ఐ న్యూస్ టీవీ రేటింగ్స్ పెరుగుతున్నాయని వాటిని వీలైనంతగా తగ్గించాలని … ఓ తెలుగు టీవీ యాజమాన్యం ..బార్క్ రేటింగ్ అధికారులతో జరిపిన రికార్డులు వెలుగులోకి వచ్చాయి. అలాగే.. ఇతర రాష్ట్రాల్లోని చానల్స్ విషయంలోనూ బయటపడ్డాయి. ఇదిచిన్న స్కాం కాదని… ఇందులో ఆర్నాబ్ ప్రమేయం మాత్రమే కాదని.. చాలా మీడియా ప్రముఖులు ఉన్నారని అనుమానిస్తున్నారు. బార్క్అనేది.. అన్ని మీడియా చానళ్ల దగ్గర చందాలు కట్టించుకుని… పని చేస్తుంది. నిజాయితీగా రేటింగులు ఇవ్వాల్సిన సంస్థ… అక్రమాలకు నిలయంగా మారింది. మహారాష్ట్ర సర్కార్ టీఆర్పీ స్కాంను వెలుగులోకి తెచ్చిన తర్వాత బార్క్ రేటింగులు ఇవ్వడాన్ని నిలిపివేసింది.
ఆర్నాబ్ గోస్వామి విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. టీఆర్పీ స్కాంలో ఆయన పాత్రపై స్పష్టమైన ఆధారాలుండటంతో ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించారు. నెలాఖరు వరకూ అరెస్ట్ లాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులకు సూచించింది. ముందు ముందు ఈ టీఆర్పీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీడియా రంగంలో ప్రముఖు ఇతర చానళ్లను ఎలా తొక్కేశారో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.