తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో దిగ్గజం లాంటి రవిప్రకాష్ ప్రస్తుతం ఆజ్ఞాతవాసిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో ఆర్ టీవీ ప్రారంభమయింది. ప్రస్తుతానికి ఇది డిజిటల్ మోడ్‌లోనే ఉంది. నిజానికి ఈ యూట్యూబ్ చానల్ చాలా కాలం కింద నుంచి ఉంది. రవిప్రకాష్ చేతిలోకి వచ్చాక బాగా పాపులర్ అవుతోంది. రవిప్రకాష్ మార్క్ దూకుడు ఈ చానల్లో కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ చానల్‌కు ఓ సమస్య వచ్చి పడింది. అదేమిటంటే…లోగో సమస్య.
ఆర్ టీవీ పేరుతో రవిప్రకాష్ యూట్యూబ్ చానల్ నడుస్తోంది. ఇది బాగా పాపులర్ అవుతూండటంతో.. జాతీయ స్థాయిలో ఆర్నాబ్ గోస్వామి దృష్టిలో పడింది. ఆర్నాబ్ చానల్ పేరు రిపబ్లిక్ . అయితే లోగో మాత్రం.. కేపిటల్ ఆర్తో పాటు డాట్ ఉంటుంది. రవిప్రకాష్ చానల్ కూడా ఆర్ అనే ఉంటుంది. రెండు దాదాపుగా ఒకేలా ఉన్నాయని ఇది కాపీరైట్ ఉల్లంఘననేనని రపబ్లిక్ టీవీ యాజమాన్యం దావా వేసింది.
ఈ దావాకు తెలుగు ఆర్ టీవీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. అసలు రిపబ్లిక్ టీవీ లోగోకు.. ఆర్ టీవీ లోగోకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా.. ఇప్పుడు నడుస్తున్న ఆర్ టీవీ .. చాలా కాలం నుంచి అంటే రిపబ్లిక్ టీవీ ప్రారంభం కాక ముందు నుంచీ ఉందని రికార్డులు సమాధానంగా పంపారు. ఈ లోగో వివాదం ఏ మలుపు తిరుగుతుందో కానీ.. యాధృచ్చికంగా టీవీ9 లోగో విషయంలోనే తన హక్కుల కోసం రవిప్రకాష్ పోరాడుతున్నారు. ఇప్పుడు ఆయన కొత్త వెంచర్ కూ లోగో కు లీగల్ సమస్యలు వస్తున్నాయి.