భారత్ ఏనాడూ ఇరుగుపొరుగు దేశాలపై దాడి చేయాలనుకోలేదు..చేయలేదు కూడా. అయినా భారత్ ని ఎల్లప్పుడూ పాకిస్తాన్ బూచిగా చూపిస్తూనే ఉంది. భారత్ పై ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాడులకు ప్రయత్నిస్తూనే ఉంది. అయినా భారత్ ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. చివరికి భారత్ కి అత్యంత వ్యూహాత్మకమయిన చాలా కీలకమయిన పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై పాక్ ఉగ్రవాదులు దాడులు చేసినప్పటికీ సంయమనంగానే వ్యవహరిస్తోంది. కానీ పాక్ మాత్రం భారత్ తమపై యుద్దానికి వస్తే ఎదుర్కోవడానికి చాలా కాలంగా సన్నాహాలు చేస్తోంది. ఆ సన్నాహాలలో భాగంగానే ఒకటీ కాదు..రెండూ కాదు..ఏకంగా 130వరకు న్యూక్లియర్ (బాంబులు) వార్ హెడ్స్ ని భారత్ పై గురిపెట్టి మీట నొక్కితే ప్రయోగించేందుకు వీలుగా సిద్దంగా ఉంచింది. ఇదేదో మీడియాలో వచ్చిన ఊహాగానం కాదు. ఇటువంటి అంతర్జాతీయ వ్యవహారాలపై లోతుగా అధ్యయనం చేసి, వాటిపై అమెరికన్ కాంగ్రెస్ కి నివేదికలు అందించే “కాంగ్రెషనల్ రీసర్చ్ సర్వీస్” (సి.ఆర్.ఎస్.) అనే స్వతంత్ర సంస్థ తాజాగా ఇచ్చిన 24 పేజీల నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది.
సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో జపాన్ పై అమెరికా ఒక న్యూక్లియర్ బాంబు ప్రయోగిస్తేనే, దాని దెబ్బ నుండి కోలుకోవడానికి జపాన్ కి దశాబ్దాల కాలం పట్టింది. ఇక పాకిస్తాన్ వద్ద సిద్దంగా ఉన్న130 న్యూక్లియర్ బాంబులను భారత్ పై ప్రయోగిస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఊహించలేము కూడా.
సి.ఆర్.ఎస్. ఇచ్చిన తాజా నివేదికలో పాకిస్తాన్ వద్ద 110 నుంచి 130 న్యూక్లియర్ బాంబులు భారత్ పై ప్రయోగించడానికి సిద్దంగా ఉన్నాయని పేర్కొంటూనే, అంతకంటే ఇంకా చాలా ఎక్కువే ఉండి ఉండవచ్చని తేల్చి చెప్పింది. అయితే అంతర్జాతీయ ఒత్తిళ్ళ కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ‘వార్ హెడ్స్’ ని చాలా కట్టుదిట్టమయిన భద్రతలో ఉంచిందని, అలాగే వాటి తయారీకి వినియోగించే వివిధ వస్తువులు, అణుపదార్ధాలను చాలా జాగ్రత్తగా కాపాడుతోందని పేర్కొంది. కానీ పాకిస్తాన్ లో నెలకొని ఉన్న అరాచక వ్యవస్థ, ఉగ్రవాదులు, తదితరుల వలన ఎప్పటికయినా వాటి వలన పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఎప్పుడయినా పాక్ లో అసాంఘీక శక్తులు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని వశపరుచుకొంటే, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎంత కట్టుదిట్టమయిన భద్రత మధ్య ఉంచినా అవి వాటి చేతికి చిక్కే అవకాశం ఉందని తన నివేదికలో పేర్కొంది. దీనిని బట్టి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చును.
కోతికి కొబ్బరి కాయ దొరికినట్లుగా ఒకవేళ పొరపాటున ఆ న్యూక్లియర్ బాంబులు పాకిస్తాన్ లో తిష్టవేసుకొని కూర్చొన్న తాలిబన్లు, జైష్-ఏ-మహమ్మద్ లేదా ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో పడినట్లయితే వారు మరో క్షణం ఆలోచించకుండా వాటిని భారత్ పై ప్రయోగించవచ్చును. అప్పుడు విధిలేని పరిస్థితుల్లో భారత్ కూడా తనను తాను రక్షించుకొనేందుకు పాక్ పై న్యూక్లియర్ బాంబులు ప్రయోగించవలసి రావచ్చును. అదే జరిగితే రెండు దేశాలు ఎన్నటికీ కోలుకోలేని దుస్థితికి చేరుకొంటాయి. అందుకే భారత్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాకిస్తాన్ తో స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తుంటాయి.
పఠాన్ కోట్ పై దాడి జరిగిన తరువాత పాక్ కి అర్ధమయ్యే బాషలోనే ధీటుగా జవాబు చెప్పాలని శివసేన వంటి పార్టీలు డిమాండ్ చేసాయి. ఒకవేళ భారత్ అటువంటి ప్రయత్నం చేస్తే ఏమయ్యేదో సి.ఆర్.ఎస్. ఇచ్చిన తాజా నివేదికను చూస్తే అర్ధం అవుతుంది. పాక్ చేతిలో ఉన్న ఈ భానకమయిన మారణాయుధాలను తొలగించడం సాధ్యం కాదు కనుక భారత్ ఎప్పుడూ ప్రమాదం అంచున ఉన్నట్లుగానే భావించవలసి ఉంటుంది.