ఖమ్మం నగరంలోని లకారం చెరువులో ఏర్పాటు చేయాలనుకున్న ఎన్టీఆర్ విగ్రహానికి న్యాయపరమైన చిక్కులు ఏర్పడటంతో నిర్వాహకులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరువు పక్కన ప్రైవేటు స్థలం కొని అందులో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. రూ.కోటితో స్థలాన్ని కొనుగోలు చేసి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించేందుకు పనలు ప్రారంభించారు. లకారం చెరువులో కృష్ణుడి రూపంలో విగ్రహం పెట్టడాన్ని కొంత మంది ఉద్దేశపూర్వకంగా రచ్చ చేశారు. కోర్టుల్లో పిటిషన్లు వేశారు. కోర్టు స్టే ఇచ్చింది.
అయితే ప్రైవేటు స్థలంలో పెట్టుకోవడానికి ఎలాంటి సమస్యలు రావు . శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మంలో లకారం ట్యాంకుబండ్లో ఏర్పాటు చేయాలని తానా మాజీ అధ్యక్షుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ తాళ్లూరి జయశేఖర్తో పాటు పలువురు ఎన్ఆర్ఐల సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టుకుని ప్రయత్నాలు చేశారు . మంత్రి పువ్వాడ చొరవతో అనుమతులు లభించాయి. 54అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మే 28న జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించాలని నిర్ణయించారు.
అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారని, అలాగే తాగునీటిచెరువుగా ఉన్న లకారంలో విగ్రహం ఏర్పాటుచేస్తే నీరు కాలుష్యం అవుతుందని కొందరు హైకోర్టుకు వెళ్లడంతో విగ్రహావిష్కరణ చేయవద్దని కోర్టు స్టే విధించింది. శ్రీకృష్ణుడి అవతారంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పిల్లనగ్రోవి, నెమలిపింఛం తొలిగించారు. అయినా విగ్రహ ఏర్పాటుకు కోర్టు అనుమతించలేదు. దీంతో విగ్రహం ఆవిష్కరణను వాయిదా వేశారు. ఇప్పుడు ప్రైవేటు స్థలంలో ఆగస్టులో ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.