ప్రజల కోసం ప్రగతి కోసం ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రాంగ్ రూట్లో వెళ్తోందా? ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాలు గమనిస్తే ఈ అనుమానం కలుగుతుంది. అన్నింటికీ మించి, ఆ పార్టీ రాజ్య సభ సభ్యుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కేసు విచారణకు ఎదుర్కోవడం ఒక ఎత్తు. ఏకంగా ఆయన అరెస్టుకు వారెంట్ జారీ కావడం మరొక ఎత్తు. కోర్టు ఎన్నిసార్లు సమన్లు పంపినా పట్టించుకోని ఫలితంగా వారెంట్ జారీ అయింది. అంటే కోర్టులంటే నిర్లక్ష్యమా లేక జనం ఏమనుకుంటే నాకేంటనే ధిక్కారమా అర్థం కాదు.
మారిషస్ బ్యాంకులకు 106 కోట్ల రూపాయలు బకాయి పడిన సుజనా గ్రూపు పై నాంపల్లి కోర్టులో విచారణ జరగుతోంది. సుజనా అంటేనే సుజనా చౌదరిగా పేరు పొందారు. అలాంటి వ్యక్తి బ్యాంకుకు భారీ మొత్తం బకాయి పడి కోర్టుకు పోవాల్సిన పరిస్థితి రావడమే దారుణం. విషయాన్ని సాగదీయకుండా త్వరగా తేల్చుకోవాలని సుజనాకు చంద్రబాబు సలహా ఇచ్చారో లేదో తెలియదు. ఇప్పుడు ఏకంగా అరెస్టు వారెంటు జారీ అయింది. దీన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
పదే పదే కోర్టు నోటీసులను నిర్లక్ష్యం చేస్తే అరెస్టు వారెంటు జారీ అవుతుందని కనీస అవగాహన ఉన్న ఎవరికైనా తెలుసు. బడా వ్యాపార వేత్త, ఎంపీ, మంత్రి అయిన సుజనాకు, ఆయన లాయర్లకు ఈ విషయం తెలియదని అనుకోలేం. ఈ కేసులో మినహాయింపు కోసం సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన వ్యక్తి, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడనేది అంతుపట్టదు. వారెంటు జారీ అయింది కాబట్టి రూలు ప్రకారం ఆయన్ని పోలీసులు అరెస్టు చేయాలి. కానీ అధికార పార్టీ ఎంపీ, పైగా కేంద్ర మంత్రి. కాబట్టి అరెస్టు చేస్తారా అనేది అనుమానమే. తదుపరి విచారణ నాడు కోర్టుకు హాజరై పిటిషన్ దాఖలు చేయవచ్చని అంటున్నారు. ఆ ఆప్షన్ ను ఆయన ఎంచుకుంటారేమో తెలియదు. కానీ పరిస్థితి ఇంత వరకూ వచ్చిన తర్వాత, కేంద్ర మంత్రిగా ఆయన కొనసాగే నైతిక హక్కు ఉందా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
106 కోట్ల రూపాయల లావాదేవీలో కోర్టు బోను ఎక్కాల్సిన విధంగా విచారణకు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడే, నిర్దోషిగా బయటపడే వరకూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబు సూచించాల్సిందని కొందరి అభిప్రాయం. అలా జరిగితే తెలుగుదేశం పార్టీ నైతిక విలువలకు కట్టుబడి ఉంటుందనే సంకేతాన్ని ప్రజలకు పంపినట్టు అయ్యేది. ఓ వైపు రాజధాని ప్రాంత రైతులు త్యాగాలు చేస్తే మంత్రులు, నాయకులు రాజభోగాలు అనుభవిస్తున్నారు. తాము అనుకున్న విధంగా జీతభత్యాలను పెంచుకున్నారు. ఇప్పుడు సుజనా చౌదరి విషయంలోనూ చంద్రబాబు సమర్థంగా వ్యవహరించలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాల చేతికి మరో అస్త్రం అందించేలా, చేజేతులా ఇంతదాకా తెచ్చుకోవడం ఏమిటి మంత్రి గారూ అని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏం జవాబు చెప్తారో చూద్దాం.