తెలుగు సినిమా నిర్మాతలలో ఒకప్పుడు బాగా వివాదాస్పద నిర్మాత గా ఉన్న బెల్లంకొండ సురేష్ పై అరెస్టు వారెంటు జారీ అయింది. ఒక టీవీ చానల్‌కు 3.5 కోట్లు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి ఆలస్యం చేయడం కారణంగా ఆ చానల్ కోర్టును ఆశ్రయించడం తో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది వివరాల్లోకి వెళితే..
గతంలో బెల్లంకొండ సురేష్ జబర్దస్త్ అనే ఒక సినిమాని తీశాడు. నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్ధార్థ హీరోగా వచ్చిన ఈ సినిమా హిందీలో వచ్చిన బ్యాండ్ బాజా బారత్ ని కాపీ కొట్టి తీసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆ సినిమా నిర్మాత అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ కోర్టును ఆశ్రయించి ఈ సినిమా ప్రదర్శనను నిలిపి వేశారు. అయితే బెల్లంకొండ సురేష్ అప్పటికే ఈ సినిమా హక్కులను మూడున్నర కోట్లకు ఒక టీవీ చానల్‌కు అమ్మేసుకున్నారు. ఇది తెలిసిన యశ్ రాజ్ ఫిలింస్ టీవీ లో కూడా ఈ సినిమా ప్రదర్శించడానికి వీల్లేదంటూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు యశ్ రాజ్ ఫిలింస్ కు అనుకూలంగా తీర్పు నిచ్చింది. దీంతో బెల్లంకొండ సురేష్ నుండి హక్కులు కొనుక్కున్న టీవీ ఛానల్ వాళ్ళు తాము ఇచ్చిన మూడున్నర కోట్ల ను వెనక్కి ఇవ్వాల్సిందిగా బెల్లంకొండ సురేష్ ను కోరారు. అయితే ఆయన ఇప్పుడు అప్పుడు అంటూ తిప్పించడమే తప్ప డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు టీవీ ఛానల్ కు అనుకూలంగా రావడంతో బెల్లంకొండ సురేష్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
అయితే ఇటువంటి కేసులను తెరవెనుక సెటిల్మెంట్ చేసుకోవడంలో బెల్లంకొండ సురేష్ ది అందెవేసిన చెయ్యి అని ఇండస్ట్రీలో అంటూ ఉంటారు. గతంలో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిపిన సమయంలో కూడా ఈయన తెర వెనుక సెటిల్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ టీవీ ఛానల్ తో కూడా అలాంటి సెటిల్మెంట్ ఏదైనా చేసుకుంటారో వేచి చూడాలి.