సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు గురువారం అరెస్ట్ వారెంటు జారీ చేసింది. ఆయనకు చెందిన సుజనా గ్రూప్ సంస్థలు మారిషస్ బ్యాంకులకు రూ. 106 కోట్లు బకాయిలు ఉన్నాయి. వాటిని ఆయన తీర్చకపోవడంతో ఆయనపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై ఆయన సుప్రీం కోర్టు వెళ్ళారు కానీ క్రింద కోర్టులోనే ఈ వ్యవహారం తేల్చుకోమని సూచించడంతో మళ్ళీ నాంపల్లి కోర్టునే ఆశ్రయించవలసి వచ్చింది.
ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి కోర్టు ఆయనని కోర్టుకి హాజరుకమ్మని ఆదేశిస్తూ ఇప్పటికి వరుసగా మూడుసార్లు నోటీసులు పంపినప్పటికీ ఆయన హాజరు కాకపోవడంతో, ఈరోజు ఆయనకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 26కి వాయిదా వేసింది. కేంద్రమంత్రిగా ఉన్న వ్యక్తి బ్యాంకు రుణాలు ఎగవేయడం, కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేసి అరెస్ట్ వారెంట్ అందుకోవడం చాలా శోచనీయం. దీని వలన వ్యక్తిగతంగా అయన ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బ తింటుంది.