ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా టార్గెట్‌గా మాజీ ఎంపీ హర్షకుమార్ మారారు. కొద్ది రోజుల నుంచి ఆయన బోటు ప్రమాదం.. ప్రభుత్వ నిర్లక్ష్యంగా తీవ్రమైన విమర్శలు చేస్తూ .. రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు. రూ. పాతిక లక్షలకు కాంట్రాక్ట్ ఇచ్చి.. బోటు తీయలేక చేతులు కాల్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు… తమపై విమర్శలు చేస్తున్న వారిపై గురి పెట్టింది. తప్పుడు ప్రచారం చేశారంటూ.. హర్షకుమార్ పై.. పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ప్రస్తుతం హర్షకుమార్ ఎక్కడ ఉన్నారో పోలీసులకు తెలియడం లేదు. హర్షకుమార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తామని ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్ ప్రకటించేశారు. బోటు ప్రమాద మృతుల సంఖ్యపై తప్పుదారి పట్టించారని హర్షకుమార్‌పై అధికారులు కేసు నమోదు చేశారు.
హర్ష కుమార్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. హర్షకుమార్ తప్పించుకోవడానికి సహకరించారన్న కారణంగా.. రాజమండ్రి త్రీటౌన్ సీఐ శేఖర్‌బాబును సస్పెండ్ చేశారు. ఒక్క హర్ష కుమార్ మాత్రమే కాదు.. కొద్ది రోజులుగా ఉభయగోదావరి జిల్లాలో ఇతర పార్టీల నేతలపై పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చాలా చిన్న వివాదానికి వందల మంది పోలీసుల్ని తీసుకొచ్చి.. రాజోలు జనసేన ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కోర్టు మొట్టికాయలు వేయడంతో పోలీసుల పరువు పోయినంత పనైంది. చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసి.. విడుదల కాకుండా వరుస కేసులు నమోదు చేస్తున్నారు.
పోలీసుల తీరుపై.. సాధారణ ప్రజల్లోనూ సందేహాలు పెరుగుతున్న సమయంలో… ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన నేతలందర్నీ పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూండటం .. కలకలం రేపుతోంది. ఎంత మందిని అరెస్ట్ చేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నప్పటికీ.. ఒక్క కేసు పెట్టడం లేదు. కానీ టీడీపీ, జనసేన కార్యకర్తల్ని మాత్రం.. వెంటాడుతున్నారు.