బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారని.. కవితను కూడా చేరమన్నారని…. మహా అయితే ఏం చే స్తారు.. జైలుకు పంపుతారు అంతే కదా అని కేసీఆర్ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. కార్యవర్గ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ కవిత ఈడీ కేసుల అంశంపై చర్చించారు. శనివారం కవితను అరెస్ట్ చేయొచ్చునని… చేసుకుంటే చేసుకోని అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా తెలు్సతోంది. అందర్నీ వేధిస్తున్నారు.. భయపడేది లేదు.. పోరాటం వదిలేది లేదు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామని పార్టీ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. గంగుల, రవిచంద్ర.. ఇప్పుడు కవిత వరకు వచ్చారు.. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తారు.. ప్రజల కోసం కడుపు కట్టుకుని పనిచేయాలని సూచించారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఆలోచనే లేదని సీఎం కేసీఆర్ పార్టీ కార్యవర్గసభ్యులకు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలు సమావేశాలు పెట్టుకుని పాదయాత్రలు చేయాలని సూచించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపడుతోందని.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కవితను అరెస్ట్ చేస్తే .. ఎలాంటి నిరసనలు చేయాలో కూడా కార్యవర్గ సమవేశంలో సూచించినట్లుగా తెలుస్తోంది.
మరో వైపు కవిత శనివారం ఉదయం ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఆమెను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులోనూ ఈడీ కవిత పేరును పలుమార్లు ప్రస్తావించింది. 32.5 శాతం వాటాకా సౌత్ గ్రూప్ లో కవితకు ఉందని.. పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో..కవిత సోదరుడు కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. శనివారం ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.