ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి రెండు నెలలు అయింది. ఘటన జరిగినప్పటి నుండి.. ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అంత భారీ ప్రమాదానికి కారణమైన వారిపై.. అపరిమితమైన అభిమానం చూపుతున్నారని.. చర్యలు తీసుకోవడం లేదని.. చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే హైపవర్ కమిటీ వేశామని… ఆ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పుకుంటూ వస్తున్నారు. చివరికి ఆ కమిటీ రెండు నెలలకు రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన రెండు రోజులకు ఎల్జీ పాలిమర్స్ ఎండీ సహా పదకొండు మందిని అరెస్ట్ చేశారు. ఆ రిపోర్ట్‌లో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని.. ఇంకా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు.
నిజానికి ప్రమాదం జరిగినప్పుడే.. అది యాజమాన్యం నిర్లక్ష్యం అని స్పష్టంగా తెలిసిపోయింది. ఎన్జీటీ కమిటీ కూడా అదే రిపోర్ట్ ఇచ్చింది. కనీసం… ప్రమాదం జరిగినప్పుడు సైరన్ కూడా మోగించలేదంటే.. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో స్పష్టమవుతోంది. అంతా కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం.. హైపవర్ కమిటీ పేరుతో రెండు నెలలు ఆలస్యం చేసి నిందితుల్ని అరెస్ట్ చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు చాలా మంది సంతోషపడుతున్నారు కానీ.. ఇలా ఆలస్యం చేయడం వల్ల.. ప్రభుత్వ ఇమేజ్‌కే ఇబ్బంది ఏర్పడింది. ఇతర విషయాల్లో ప్రాథమిక విచారణ కూడా లేకుండా.. అన్ని ఆధారాలు ఉన్నాయంటూ.. అదే పనిగా అరెస్టులు చేస్తున్న పోలీసులు ఈ విషయంలో మాత్రం.. హైపవర్ కమిటీ రిపోర్ట్ అంటూ.. రెండు నెలల పాటు సైలెంట్‌గా ఉండటం.. ఈ లోపు కొంత మంది కొరియన్లు.. విదేశాలకు వెళ్లడానికి పర్మిషన్లు తీసుకోవడంతో ప్రభుత్వ తీరు విమర్శల పాలయింది.
ఇప్పటికైనా.. ఆ పరిశ్రమను అక్కడ్నుంచి తరలించి..ఈ విషయంలో ప్రభుత్వం.. చాలా సీరియస్‌గా ఉందని.. నిరూపించుకోవాలని బాధితులు అంటున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఎండీతో పాటు… ఇతరులపై పెట్టిన కేసులు.. ప్రమాదం జరిగినంత తీవ్రంగా ఉండాలని.. అంతే గట్టిగా న్యాయస్థానాల్లో బాధితుల తరపున వాదన వినిపించేలా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో… గట్టి శిక్షలు పడితేనే.. ఇతర కెమికల్స్ ఉపయోగించే పరిశ్రమలు.. సీరియస్‌గా ఉంటాయని చెబుతున్నారు.