రాజధాని తరలింపు విషయం.. మూడు రాజధానుల వ్యవహారం.. అమరావతి రైతుల ఆందోళన.. ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఓ రాష్ట్రం ఇంతలా అతలాకుతలం అవుతున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ నేతలు కూడా.. జోక్యం చేసుకోవాలని.. బీజేపీ అగ్రనాయకత్వాన్ని పదే పదే కోరుతున్నారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం పాత్ర పై కూడా.. వైసీపీలో చర్చ జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం.. కేంద్రానికి జోక్యం చేసుకునే అధికారం ఉందని.. రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం.. రాజధాని తరలింపును.. కేంద్రం.. ఒక్క ఆదేశంతో నిలిపివేయవచ్చని చెబుతున్నారు.
అయితే కేంద్రం.. ఇప్పటి వరకూ ఎలాంటి జోక్యం చేసుకోలేదు. కనీసం.. గవర్నర్ ద్వారా నివేదిక కూడా తెప్పించుకోలేదు. కేంద్రం తటస్థ పాత్ర పోషిస్తుందనే భావన చాలా మందిలో ఉంది. ఇప్పుడు పరిస్థితులు దిగజారిపోయాయి కాబట్టి జోక్యం చేసుకుంటుందా.. అనే చర్చ కూడా నడుస్తోంది. ఒక వేళ జోక్యం చేసుకుంటే.. ఏ పద్దతిలో జోక్యం చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ వర్గాలు మాత్రం.. ఆర్టికల్ త్రీని అంత తేలిగ్గా ఉపయోగించుకునే అవకాశం లేదని అంటున్నాయి. అయితే.. తమకు ముందుగా చెప్పి చేస్తున్నామని.. వైసీపీ నేతలు ప్రచారం చేస్తూండటంపై బీజేపీ వర్గాలు కాస్త అసహనంతో ఉన్నాయి. ఇది కూడా.. జోక్యం చేసుకోవడానికి ఓ కారణంగా మారొచ్చని నేతలు అంచనా వేస్తున్నారు.
నిజానికి కేంద్రం.. జోక్యం చేసుకుని.. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభావితం చేయాలనుకుంటే… ఆర్టికల్ త్రీ వరకూ అవసరం లేదు. అమిత్ షా ఒక్క ఫోన్ కాల్తో.. పరిస్థితి మారిపోతుంది. ఎందుకంటే… నిర్ణయాలు తీసుకునే పెద్దల వెనుక అంత లగేజీ ఉంది మరి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ.. కేంద్రానికి.. ఏపీ సర్కార్ చాలా ముందుగానే చెప్పిందని.. వారు తమకు సంబంధం లేనట్లుగా ఉంటామన్న హామీతోనే ముందడుగు వేశారని జాతీయ మీడియా చెబుతోంది. అందుకే.. కేంద్ర జోక్యంపై సందేహం ఉంది.