ఆర్టికల్ 370 రద్దు చేసి సుదీర్గ సమస్యకు మోదీ సర్కార్ చెక్ పెట్టింది. ఇదే అస్త్రంగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంది. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకించి.. తాము వస్తే మళ్లీ తెస్తామన్నట్లుగా ప్రచారం చేసిన ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా తన పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌కు మంచి విజయం సాధించి పెట్టారు. కాంగ్రెస్ కూడా ఆయనతో జత కలిసి పది సీట్ల వరకూ సాధించింది. మొత్తంగా కాంగ్రెస్ కూటమికి ఓ రాష్ట్రం చిక్కినట్లయింది.
అయితే వారు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా ఆర్టికల్ 370ని మళ్లీ కశ్మీర్లో తీసుకు రావడం దాదాపుగా అసాధ్యం. ఆ విషయంలో అక్కడి ప్రజల్లో సానుకూలత ఉండవచ్చేమో కనీ.. దేశంలో కలిపేసిన కశ్మీర్ ను మరోసారి విడదీస్తారన్న విమర్శలు కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ హామీ గురించి ఇక కాంగ్రెస్ కూటమి మాట్లాడకపోవచ్చు. బీజేపీ జమ్మూ కశ్మీర్ పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ విజయం నల్లేరు మీద నడకే..కానీ ముస్లిం జనాభాను ఆకట్టుకోవడంలో బీజేపీ విఫలమయింది.
అయితే బీజేపీ మంచి ఫలితాలను సాధించినట్లే. ఇప్పటికీ జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా లేదు. అందుకే అక్కడ ప్రభుత్వం ఏర్పడినా.. లెఫ్టినెంట్ గవర్నర్దే కీలక పాత్ర. మొత్తంగా ఆర్టికల్ 370 సెంటిమెంట్‌తో కశ్మీర్లో గెలిచాయాలనుకున్న బీజేపీకి గడ్డు పరిస్థితే ఎదురయింది. కానీ దేశం బయట మాత్రం ఈ సెంటిమెంట్ బీజేపీకి ప్లస్ అవుతుంది.