బ్యాంకుల అత్యున్నత అధికారుల వేతనాలు ఎంత ఉండాలి? లక్షల్లోనా.. కోట్లలోనా.. ప్రైవేటు రంగ బ్యాంకుల సిఇఓలు కోట్లలో జీతాలు తీసుకుంటుంటే.. పాపం ఎస్బీఐ ఛైర్మన్ 29 లక్షల రూపాయల లోపేనట. ఓ ప్రముఖ పత్రికలో ఈకథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం భారత్‌లో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య కిందటి ఆర్థిక సంవత్సరంలో కేవలం 28లక్షల 96 వేల రూపాయలు మాత్రమే జీతంగా తీసుకున్నారనీ, ఇది మిగిలి ప్రైవేటు రంగ బ్యాంకుల సారధులకంటే అతి తక్కువని ఆ కథనం వివరించింది. రఘురామ్ రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్‌గా వ్యవహరించినప్పుడు ప్రభుత్వ బ్యాంకుల సారధుల వేతనాలు తక్కువగా ఉన్నాయని ఆవేదన కూడా వ్యక్తంచేశారనీ, వేతనాలు తక్కువ కావడం వల్ల ప్రతిభావంతులు ఇటువైపు చూడటం లేదనీ కూడా ఆ కథనం పేర్కొంది.
ఐసీఐసీఐ సిఇఓ చందా కొచ్చర్‌కు ఆరు కోట్ల రూపాయలు, యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మకు మూలవేతనంగా 2.7 కోట్లు, టిఏడీఏల రూపంలో కోటి 35 లక్షలు, ఇతరత్రా 90 లక్షల రూపాయలు వెరసి 5 కోట్ల రూపాయల వరకూ అందుకున్నారు. ఎస్ బ్యాంక్ ఎండీ రాణా కపూర్ 6.8 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి ఎండీ ఆదిత్యపురి 10 కోట్ల రూపాయల వేతనంతో పాటు ఇతరత్రా 57 కోట్ల రూపాయలను అందుకున్నారని ఆ కథనంలో వివరించింది.
స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ శాఖలను కలుపుకుని మరింత బలమైన వ్యవస్థగా రూపొందిన తరుణంలో ఈ కథనం ప్రచురితమవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటనేది సుస్పష్టం. ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల చైర్మన్ వేతనాలను ఇందులో ప్రస్తావించలేదు. అంటే ఎస్బీఐ అధినేత వేతనం పెరిగేలా చేసుకుంటే వారికీ పెరుగుతాయనే ఉద్దేశమై ఉండవచ్చు. వేతనం చాలలేదనుకుంటే సంబంధిత అధికారులు రిజర్వ్ బ్యాంకుకు విన్నవించుకోవచ్చు. అధికారంలో ఉన్ననేతలు ప్రజలు త్యాగాలు చేయాలనీ, కఠిన నిర్ణయాలకు సహకరించాలనీ కోరుతుంటారు. త్యాగాలు ప్రజలు మాత్రమే చేయాలా? ఉద్యోగులు ప్రజలతో సమానం కాదా. దేశ సేవ కోసం వారూ కొన్ని ప్రయోజనాలను వదులుకోవచ్చు కదా. ఎలాగూ బ్యాంకు చార్జీలు పెరిగాయి కాబట్టి తమ వేతనాలు పెరగాలని వారు భావిస్తున్నారా? అలా చేస్తే ప్రజలను కొట్టి అధికారులను పోషించడమే కాగలదు. గల్ప్ యుద్ధ సమయంలో పెట్రోలుపై వేసిన పన్నును ఇంతవరకూ తొలగించలేని కేంద్రానికి అసలు ఆ హక్కుంటుందా?
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి