కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా … ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చెందిన సాక్షి మీడియా ఆయనను వదిలి పెట్టలేదు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి తమ రాజకీయ వేధింపులు కాదని చెప్పుకునేందుకు… ఆయన కుమారుడిపై నిందలేసేందుకు క్షణం కూడా ఆలోచించకుండా… ప్రసారాలు ప్రారంభించేసింది. క్వశ్చన్ మార్కులు పెట్టి… కోడెల కుమారుడే ఏదో చేసినట్లుగా… ఆయన పరారయినట్లుగా… రాసుకొచ్చారు. టీవీల్లో బ్రేకింగులు వేసుకున్నారు. కోడెల పరిస్థితి అంత విషమంగా ఉంటే… అసలు ఎందుకు కోడెల కుమారుడు ఆస్పత్రి పరిసరాల్లో కనిపించలేదని అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే.. కోడెల కుమారుడు శివరాం.. విదేశీ పర్యటనలో ఉన్నట్లుగా తేలింది.
ఆయన కొద్ది రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్నారని.. విషయం తెలిసిన తర్వాత బయలుదేరారు. తెల్లవారుజామున ఆయన హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. రాజకీయ వేధింపుల వల్లే.. కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న ఆగ్రహం ప్రజల్లో కనిపిస్తూండటంతో… వైసీపీ నేతలు… ఏ మాత్రం తడుముకోకుండా ప్రత్యారోపణలు ప్రారంభించారు. సాక్షి మీడియాలో చెప్పినట్లుగా… మంత్రి బొత్స.. మీడియా ముందుకు వచ్చి ఆయన మృతిపై రకరకాల ఊహాగానాలు చోటు చేసుకుంటున్నాయని సమగ్ర దర్యాప్తు జరిపించాలని తెలంగాణ పోలీసుల్ని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు.
కోడెలపై గతంలోనూ… ఇదే తరహాలో ప్రచారం చేసి మానసిక వేదనకు గురి చేశారని.. ఇప్పుడు చనిపోయిన తర్వాత.. ఆయన కుటుంబసభ్యులను కూడా.. వేధిస్తున్నారని… కోడెల సన్నిహితులు.. జగన్ మీడియాపై విమర్శలు గుప్పిస్తున్నారు.