ఒకప్పుడు వెండి తెరపై అమ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్స్.. అన్నపూర్ణమ్మ. హీరో ఎవరైనా, కథ ఎలాంటిదైనా అమ్మ పాత్రంటే ఆమెకు కట్టబెట్టాల్సిందే. ఇప్పుడు సినిమాల్లో అమ్మ పాత్రలే కనుమరుగైపోయాయి. యంగ్ హీరోలకు అమ్మగా అన్నపూర్ణమ్మ సెట్ అవ్వరు కూడా. అందుకే బామ్మ పాత్రలకు షిఫ్ట్ అయిపోయారు. సినిమాల్లో అవకాశాలు తగ్గాక, బుల్లితెరపై ఫోకస్ చేశారు. ఈమధ్యే ఓ యూ ట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారామె. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త దుమారాన్ని సృష్టిస్తున్నాయి. అమ్మాయిలకు మితిమీరిన స్వేచ్ఛ అవసరం లేదని, అర్థరాత్రి 12 తరవాత ఆడది బయట తిరగాల్సిన అవసరం ఏముందని, అమ్మాయిల కట్టూ బొట్టూ కూడా మారాలని, వాటిని చూసే అబ్బాయిలు వెంటపడుతున్నారని, అది అబ్బాయిల తప్పు కూడా కాదని ఓ సంప్రదాయక మహిళగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై అభ్యుదయ మహిళలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలకు అమ్మాయిలే కారణమన్నట్టు ఆమె మాట్లాడుతున్నారని తప్పుబడుతున్నారు. ఇలాంటి విషయాలపై ఎప్పుడూ కఠినంగా స్పందించే చిన్మయి కూడా కాస్త సెటైరికల్ గా సమాధానం ఇచ్చారు. ఎంత ఎమర్జెన్సీ అయినా అమ్మాయిలు బయటకు రావొద్దని, ఆరు దాటితే ఆసుపత్రిలో పేషెంట్లుగా కూడా ఉండొద్దని, డాక్టర్లుగా అస్సలు అమ్మాయిలు ఉండకూడదని… వ్యంగ్యంగా మాట్లాడింది చిన్మయి.
అన్నపూర్ణ మాటలు ఈతరాన్ని కాస్త ఇబ్బంది పెడుతున్నాయన్నది నిజమే. ఆమె వయసు, చూసొచ్చిన కాలం అలాంటివి. సంప్రదాయకమైన ఆలోచనల నుంచి బయటకు రానివాళ్లంతా ఇలానే మాట్లాడతారు. అది వాళ్ల తప్పుకాదు. జనరేషన్ అలాంటిది. వాళ్ల జనరేషన్‌కి జీర్ణం కాని విషయాలు ఇప్పుడు చాలానే జరుగుతున్నాయి. అందుకే ఇలా రియాక్ట్ అవుతుంటారు. కనీసం ఆమె పెద్దరికాన్ని, అనుభవాన్ని చూసైనా సరే.. అన్నపూర్ణమ్మని వదిలేయడం మంచిదేమో..? చిన్మయి సీరియస్ గా స్పందించాల్సిన టాపిక్స్ చాలానే ఉన్నాయి. ఈ పెద్దావిడపై ఫోకస్ తగ్గించి, వాటిపై దృష్టిసారిస్తే బాగుంటుంది.