ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం మధ్యాహ్నం పార్లమెంటులో ప్రవేశ పెట్టే కేంద్ర బడ్జెట్ కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదాయ పన్ను కనీస పరిమితిని పెంచుతారేమో అని వేతన జీవులు ఆశపడుతున్నారు. పెద్దలకు రాయితీలకు బదులు పేదల బతుకు బాగు చేసేలా సాహసోపేతమైన చర్యలు ఉంటాయేమో అని సామాన్యుడు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడు. ఆమ్ ఆద్మీకి అనుకూల బడ్జెట్ వస్తుందా లేక బడా బాబులకు తాయిలాలు పంచేలా ఉంటుందా అనేదే సస్పెన్స్.
సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ కొంత వాస్తవిక దృష్టితోనే కనిపించింది. తాయిలాలతో పాపులర్ బడ్జెట్ కుబదులు వాస్తవ దృష్టితో సౌకర్యాల పెంపు, దుబారా తగ్గింపు, ఆదాయం పెంపు అనే మూడు అశాల చుట్టూ తిరిగింది. నిజానికి రైల్వేలకు ఇప్పుడు కావాల్సింది ఇవే. మరి జైట్లీ ఏం చేస్తారనేది చూడాలి.
బడా పారిశ్రామికవేత్తలకు ఊరట కలిగించే రాయితీలు ఇవ్వడానికి ఉత్సాహం చూపుతారని ఆయనపై ఒక విమర్శ ఉంది. ఆమ్ ఆద్మీ కష్టాలు ఆయనకు తెలియవని, కాబట్టి సామాన్యులు ఎక్కువగా ఆశించవద్దని విపక్షాలు విమర్శిస్తుంటాయి. ఆదాయ పన్ను పరిమితిని కనీసం 4 లక్షల రూపాయలకు పెంచాలని వేతన జీవులు కోరుకుంటున్నారు. దేశంలో కోట్లాది రూపాయలు సంపాదించే ఎంతో మంది ఒక్క రూపాయి కూడా ఆదాయ పన్ను చెల్లించడం లేదు. ఈ సంగతి ప్రభుత్వానికి తెలుసు. దేశంలో లక్షల కోట్ల నల్లధనం మూలుగుతోంది. ఈ విషయం కూడా సర్కారుకు తెలుసు. అయినా, దాన్ని వెలికి తీయడానికి బదులు వేతనజీవులను బాదడంతో సరిపెడుతున్నారు.
ఆర్థిక రంగంలో దేశ పరిస్థితి ఆశావహంగా ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే, ఒక డాలర్ ను కొనడానికి దాదాపు 100 రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి వస్తుందా అనిపిస్తుంది. ఒక దశలో డాలర్ కు బారాణా, అంటే ముప్పావలా స్థాయిలో రూపాయి విలువ పడిపోయింది. ప్రస్తుతం 68.80 స్థాయిలో ఉంది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి 1 డాలర్ విలువ 1 రూపాయితో సమానం. రానురానూ మన ఆర్థిక మందగమనం, అమెరికా దూకుడుతనం కారణంగా రూపాయి విలువ దిగజారుతూ వచ్చింది. ఇకనైనా మన రూపాయి సగర్వంగా డాలర్ తో సమానం అయ్యే అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి.
సంవత్సరం డాలర్ తో రూపాయి మారక విలువ
1947 1
1952 4.75
1966 7.10
1976 8.97
1986 12.60
1990 17.50
2000 45.00
2005 44.01
2010 45.65
2014 61.00
2016 68.80
(ఫిబ్రవరి 27)