కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరోసారి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు..! ఆంధ్రాకి సంబంధించిన విషయాలే మాట్లాడతారని తెలిసేసరికి… రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా, అందరూ న్యూస్ ఛానెల్స్ కి అతుక్కుపోయారు. కేంద్రంపై అన్ని రకాలుగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఊరట కలిగించే ప్రకటనలు ఆయన చేస్తారేమో అని అందరూ ఆశించారు. కానీ, మరోసారి మళ్లీ నిర్లక్ష్యం, అదే చిన్నచూపు, అదే ఆధిపత్య ధోరణి, అదే పాత వాదన అరుణ్ జైట్లీ వినిపించారు.
ప్రత్యేక హోదా ఇప్పుడు సాధ్యం కాదని జైట్లీ అన్నారు. 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వొద్దని చెప్పందిన్నారు. హోదాకు సమానమైన ఆర్థిక సాయం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అంతేకాదు, ఆ సాయం ఎలా తీసుకోవాలో రాష్ట్రమే నిర్ణయించుకోవాలని చెప్పడం హైలైట్..! పన్ను ప్రోత్సాహాకాలన్నీ తొలి రెండు బడ్జెట్లలో ఇచ్చేశామన్నారు. విభజన వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందనీ, ఆ సానుభూతి తమకు ఉందనీ, అయితే నిధుల కేటాయింపు అనేది సెంటిమెంట్ల ఆధారంగా జరగదన్నారు. రాజకీయ ఆందోళనల వల్ల నిధుల సంఖ్యలో మార్పురాదనీ, నిధులు ఎలా ఇవ్వాలో ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుందన్నారు. విభజన చట్టంలో ప్రతీ అంశాన్ని అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ఇవ్వం అని ఎప్పుడూ చెప్పలేదనీ, హోదాకీ ప్యాకేజీకి పెద్దగా తేడా లేదన్నారు.
ఇంతే, ఇంతకుమించి ఆయన ప్రకటించిందేం లేదు! సెంటిమెంట్లూ రాజకీయ పోరాటాల పేరుతో నిధులు సాధించుకోలేరు అనడం పరోక్ష హెచ్చరిక. ప్రస్తుతం ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆందోళనల్ని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా, ఈ ఆందోళనల్ని అత్యంత నిర్లక్షపూరితంగా చూస్తున్నారు. ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే… 2016 సెప్టెంబర్ లో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన శ్రీమాన్ జైట్లీగారే… ఇవాళ్ల నిధులను ఎలా తీసుకోవాలనేది రాష్ట్రమే నిర్ణయించుకోవాలని చెప్పడం! ఈ ఏడాదిన్న కాలంలో గ్రాంట్ రూపంలో నిధులు విడుదల చేయాల్సిన బాధ్యతను కేంద్రం ఎందుకు నిర్వర్తించలేకపోయింది..? దాని గురించి ఎందుకు మాట్లాడరు? అయినా, నిధులు ఎలా ఇవ్వాలో మీరే చెప్పండీ అంటూ ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అడగడం ఎక్కడైనా ఉంటుందా..? ఇదేనా ఫెడరల్ స్ఫూర్తి అంటే..? కేంద్రంలో ఉన్నాం కాబట్టి మేం రాజులం, రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మీరు సామంతులు అనే ఆధిపత్య ధోరణి ముమ్మూర్తులా అరుణ్ జైట్లీ మాటల్లో కనిపించింది. సెంటిమెంటు అనేది దేన్నీ ప్రభావితం చేయలేదని చెబుతున్న జైట్లీగారూ… ఇంతకీ ఆ సెంటిమెంట్ ఎందుకు ప్రబలిందీ, ఎవరి చర్యలకు ప్రతిఫలంగా ఢిల్లీ రోడ్ల మీదికి ఏపీ రావాల్సి వచ్చిందో ఆలోచించరా..? ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్రులను మరింత రెచ్చగొట్టి అంతిమంగా ఏం సాధించాలని అనుకుంటున్నారో.