పదిహేనో ఆర్థిక సంఘం “టెర్మ్స్ ఆఫ్ రికమెండేషన్స్”తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గగ్గోలు రేగింది. ఇప్పటి వరకు 1971 జనాభా లెక్కల ప్రకారం ఆర్థిక సంఘం నిధులు పంపిణి చేస్తూ వస్తోంది. ఈ సారి… 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నరేంద్రమోదీ ప్రభుత్వం సూచించింది. ఇదొక్కటే కాదు.. రాష్ట్రాలను నిర్వీర్యం చేసే మరికొన్ని ప్రతిపాదనలు ఆర్థిక సంఘానికి కేంద్రం సూచించిందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అందుకే కలసిపోరాటానికి సిద్ధమయ్యాయి. మొదటి సారి కేరళలో సమావేశం అయ్యారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు మినహా.. మిగతా రాష్ట్రాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. అయితే ఈ సమస్య కేవలం దక్షిణాదిది కాదని… మొత్తం బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు ఇబ్బందికరమని..ఏపీ అర్థిక మంత్రి యనమమ రామకృష్ణుడు భావించి..అమరావతిలో పదకొండు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశాన్ని నిర్వహించారు. కొన్ని ఇబ్బందులున్నా.. తెలంగాణ, తమిళనాడు, ఒడిషా మినహా.. ఆతిధ్య రాష్ట్రంతో కలిసి ఎనిమిది రాష్ట్రాలు సమావేశానికి హాజరయ్యాయి. విశేషం ఏమిటంటే… తమిళనాడు, ఒడిషాలు లేఖలు పంపాయి. అంటే.. ఒక్క తెలంగాణ మాత్రమే.. ప్రస్తుతానికి పదిహేనో ఆర్థిక సంఘం రూల్స్ పై చూసీ చూడనట్లు ఉంటోంది.
ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నీ కలిసి… పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసి.. ఢిల్లీలో సమావేశం పెట్టుకుని రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించాయి. నిజానికి ఇదేదో రాజకీయ సమావేశం అయితే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కానీ… ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాని పట్టించుకుని ఉండేవారు కాదు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు దీనికి ఎక్కడా రాజకీయ పొడ సోకకుండా.. పక్కాగా రాష్ట్రాల పోరాటంగా ప్లాన్ చేశారు. దీంతో ఒకేసారి…అన్ని రాష్ట్రాలు.. కేంద్రంపై తిరుగుబాటు చేయడమంటే.. కచ్చితంగా అది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతున్నట్లే. దీన్ని లైట్ తీసుకుంటే.. మొత్తానికే మోసం వస్తుంది. అందుకే అరుణ్ జైట్లీ ఉన్నపళంగా.. ఆరుగురు సభ్యులతో ఓ హైపవర్ సలహాదారుల కమిటీని నియమించారు. ఈ సలహాదారుల కమిటీ… బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై ప్రధానంగా అధ్యనం చేసి.. టెర్మ్స్ ఆఫ్ రికమెండేషన్స్ లో మార్పులుచేర్పులూ సూచిస్తుంది. అవసరమైన అధ్యయనం చేసి.. ఆర్థికసంఘానికి సాయంగా ఉంటుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే…ఇది కేవలం కంటి తుడుపు చర్యేనన్న అనుమానం రాకమానదు. ప్రభుత్వం ఇప్పటి వరకూ రాజ్యాంగబద్ద పదవుల్లో కూడా.. తన మాటలు వినేవారిని మాత్రమే నియమిస్తుంది. ఇప్పుడు ఈ సలహాదారుల కమిటీ ద్వారా కూడా.. ఈ “టెర్మ్స్ ఆఫ్ రికమండేషన్స్” మంచివే అనే నివేదికను ఇప్పించుకుని దానిపైనే ముందుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పోరు బాట పట్టిన రాష్ట్రాలు.. ఈ ప్రమాదాన్ని అంచనా వేసి.. పోరాటం కొనసాగించి.. విధివిధానాల్లో మార్పులు చేసుకోగలిగితేనే ప్రయోజనం . లేకపోతే.. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగిపోతుంది.