ఘరానా మోసగాడు విదేశాలకు ఉడాయించాడు. లలిత్ మోడీ తరహాలో విజయ్ మాల్యా హాయిగా లండన్ చేరుకున్నాడు. భారీగా రుణాలిచ్చిన బ్యాంకుల ఔదార్యమే అతడికి కొండంత రక్షణ అయింది. కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించక పోవడం, ఆర్థిక శాఖ నిద్ర పోవడం, అరుణ్ జైట్లీ తన బాధ్యతను సరిగా నిర్వర్తించక పోవడం, సీబీఐ కూడా సరైన విధంగా పనిచేయక పోవడం… ఇలా వివిధ కారణాలు, అనేక శక్తులు మాల్యాకు యథాశక్తి సహకరించాయి.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చాలా సుప్రసిద్ధ లాయర్. బడా బడా కేసులను వాదిస్తుంటారు. సీబీఐ లుకౌట్ నోటీస్ ఉన్న విజయ్ మాల్యాను ఎలా దేశం విడిచిపోనిచ్చారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. వెంటనే ఖత్రోచీ సంగతేంటని జైట్లీ ఎదురు ప్రశ్నించారు. గతంలో ఉన్న ప్రభుత్వం సరిగా లేదని ప్రజలు భావించారు కాబట్టే ప్రజలు మీ పార్టీకి ఓటేశారు జైట్లీజీ. ఇప్పుడు మళ్లీ గతాన్ని తవ్వుతూ కూర్చోవడం తెలివి కాదు. అతి తెలివి అవుతుంది.
మాల్యా లోన్ ఎకౌంట్ చాలా కాలం క్రితమే ఎన్ పి ఎ గా, అంటే మొండి బాకీగా మారింది. ఆ జల్సారాయుడి బాగోతాలు దేశంలో అందరికీ తెలుసు. పైగా, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగుల జీతాల నుంచి ఆదాయ పన్ను కోసం కట్ చేసిన టీడీఎస్ సొమ్మును కూడా సొంతానికి వాడుకున్నాడనే నీచమైన అభియోగం కూడా మాల్యాపై ఉంది. ఆ కేసులో అరెస్టు కావాల్సిన వాడు అదృష్టం కొద్దీ బెయిలు పొందాడు.
జల్సాలు తప్ప మరేమీ తెలియనట్టు దుబారా ఖర్చు పెడుతున్న ఈ ప్లేబాయ్, కావాలనే రుణాలను ఎగ్గొడుతున్నాడని చూసే వాళ్లెవరికైనా అర్థమవుతుంది. జైట్లీ శాఖకు మాత్రం అర్థం కాలేదేమో. సంస్థ ఉద్యోగుల నుంచి ఆదాయ పన్నుశాఖకు జమ చేయడానికి వసూలు చేసిన టీడీఎష్ సొమ్ము కూడా సొంతానికి వాడుకున్నాడనే నీచమైన అభియోగం మాల్యాపై ఉంది. ఆ వ్వవహారంలో అరెస్టు కావాల్సిన వాడు అదృష్టం కొద్దీ బెయిలు పొందాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దివాళా తీసి మూడేళ్లు దాటింది. అప్పుడే రూ. 7 వేల కోట్ల వసూలుకు అలర్ట్ కావాలంటూ జైట్లీ, ఆయన శాఖ బ్యాంకులను హెచ్చరించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.
అసలు అన్ని బ్యాంకుల కంటే ఎక్కువగా, రూ. 1600 కోట్లు ఈ ఘరానా మోసగాడికి ఉదారంగా లోన్ ఇచ్చిన ఎస్ బి ఐ విల్ ఫుల్ డిఫాల్టర్ గా ప్రకటించడానికి మూడేళ్లు ఎందుకు నిద్రపోయిందని ఆర్థిక శాఖ అడిగిన పాపాన పోలేదు. అడుగడుగునా అరుణ్ జైట్లీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు తన అతి తెలివిని బయట పెడుతూ ఖత్రోచీ గురించి, లలిత్ మోడీ గురించి మాట్లాడి ఏదో ఎదురు దాడి చేశానని సంబర పడటం దారుణం.
అయినా, రాహుల్ గాంధీ సైతం జవాబు చెప్పాల్సి ఉంది. ఇంత పెద్ద కుంభకోణం చాలా కాలంగా కళ్ల ముందే కనిపిస్తున్నా ఒక్కసారి కూడా ప్రస్తావించ లేదు. తాను పేదల పాలిట పెన్నిధినని చెప్పుకొనే రాహుల్ సైతం మాల్యా గురించి పల్లెత్తు మాట అనలేదు. గురువారం నాడు మాత్రమే ఓ రెండు నిమిషాలు దీని గురించి మీడియాతో మాట్లాడి మమ అనిపించారు. మొత్తం మీద, బడా నాయకులందరూ కట్టగట్టుకుని నిద్రపోయారో, నిద్ర నటించారో, వడ్డీతో కలిపి రూ. 9 వేల కోట్లు ఎగ్గొట్టిన ఘరానా దొంగను దేశం దాటించారు. తమ నిర్వాకంతో, అసమర్థతతో వీళ్లు పరోక్షంగా సహకరించినట్లయింది. ఇంతకీ బ్యాంకుల రుణాల సొమ్ము ఇంతే సంగతులా!?