దేశంలో ఉద్యోగులు తప్ప… మిగతా వాళ్లెవరూ పన్నులు సరిగ్గా కట్టడం లేదట. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఆదాయం రాబట్టుకుంటున్నారట. పెట్రో ధరలను తగ్గించాలని వస్తున్న డిమాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసుకున్న కవరింగ్ ఇది. ఓ లాయర్ ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తే.. దేశ ప్రజలపై ఇంత కన్నా గొప్పగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేరేమో..?. ఒక్క రూపాయి ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గిస్తే రూ. 13 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుందని.. ఆరుణ్ జైట్లీ చెబుతున్నారు. కానీ ఆ మొత్తం ప్రజల నుంచి పిండుతున్న విషయాన్ని మాత్రం బయటకు చెప్పడం లేదు. పైగా అలా ఎందుకు చేయాల్సి వస్తుందన్న నిందను ..కూడా ప్రజలపై వేశారు. పన్నులు ఎగ్గొడుతున్నారని తీర్పు చెప్పేశారు.
దేశంలో పన్ను కట్టే వారి శాతం తక్కువే. కట్టే స్థాయి ఉన్నవాళ్లందరూ కడుతున్నారు. ఆదాయం లేకుండా పన్ను కట్టమంటే ఎలా కడతారు…?. అప్పటికీ చిరు వ్యాపారులు, నగదుతో వ్యవహారాలు నడిపే బడా వ్యాపారస్తులు… పన్నులు కట్టడం లేదన్న ఉద్దేశంతో నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేశారు. వీటి తర్వాత దాదాపుగా పన్ను కట్టే వాళ్లంతా.. ప్రభుత్వం దృష్టిలో పడ్డారు. వీరి ఆదాయం.. ఖర్చులు.. లాభాలు అన్నీ ప్రభుత్వం దగ్గర వివరాలు ఉంటాయి. వీరు పన్నులు ఎగ్గొడితే తెలుసుకోవడం చాలా సులభం. అయినా అరుణ్ జైట్లీ సులభంగా ప్రజలు పన్నులు ఎగ్గొట్టేవాళ్లని తేల్చేశారు.
నిజానికి దేశంలో పన్నులు కట్టని వాళ్లంటూ ఎవరూ లేరు. ఓ వ్యక్తి ఇన్‌కంట్యాక్స్ పరిధిలోకి వస్తే అతను డబుల్ ట్యాక్స్‌లు కడుతున్నాడు. రాకపోతే.. సింగిల్ ట్యాక్స్‌లు పడుతున్నాయి. ఓ వ్యక్తి జీతం పది లక్షలు సంపాదించుకుంటే.. ఆదాయపు పన్నుగా లక్ష రూపాయలపైనే ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ తొమ్మిది లక్షల్లో… పెట్రోల్ దగ్గర్నుంచి.. నిత్యాసవర వస్తువుల వరకు దేని మీద ఖర్చు పెట్టినా… జీఎస్టీ భరించాల్సిందే. అంటే పన్ను కట్టిన డబ్బులను ఖర్చు చేసుకుంటే మళ్లీ పన్ను కట్టాల్సి వస్తోంది. ఇక ఐటీ పరిధిలోకి రాని వారు.. నిత్యావసర వస్తువుల పై పన్నులను భరించాల్సి వస్తోంది. అంటే దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా పన్ను కట్టకుండా బతకడం లేదు.ఈ విషయం ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీకి తెలియలేదేమో…?
తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… పెట్రోల్, డిజిల్ ధరలు పెంచితే.. కాంగ్రెస్ ప్రభుత్వం దోచేస్తోందని.. నరేంద్రమోదీతో కలిసి అరుణ్ జైట్లీ గగ్గోలు పెట్టారు. కానీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండింతలు, మూడింతలు దోపిడీ చేస్తున్నారు. ఒక్క లీటర్ పెట్రోల్ ధర 82 రూపాయలు అయితే.. అందులో 43 రూపాయలు పన్నులే. ఇంత కన్నా దోపిడీ ఏముంటుంది..? పైగా పన్నులు కట్టకపోవడం వల్లే ఈ బాదుడు అంటూ… మళ్లీ ప్రజలపైనే నిందలు…! అధికార గర్వం తలకెక్కితే ఇలాగే మాట్లాడతారేమో..!!