కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఆయనకు క్యాన్సర్ సోకిన విషయం తాజాగా బయటపడింది. చికిత్స తీసుకోవడానికి ఆయన న్యూయార్క్ వెళ్లారు. క్యాన్సర్ వల్ల ఆయన ఒంట్లో ఓ చోట కణితి ఏర్పడిందని.. ఆయనకు వచ్చిన క్యాన్సర్ కారకాలు.. చాలా త్వరగా శరరీంలో వ్యాపిస్తాయని.. అందుకే.. హుటాహుటిన చికిత్స కోసం ఆయన న్యూయార్క్ వెళ్లినట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీకి కొన్నాళ్ల క్రితం కిడ్నీ ఫెయిలయింది. దీంతో ఆయన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. చాలా రోజుల పాటు విధులకు దూరంగా ఉన్నారు. ఇటీవలే.. మళ్లీ ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మళ్లీ విధులకు దూరమయ్యారు.
ఎన్నికల ప్రకటన వచ్చే నెలలో రావాల్సి ఉండగా.. ఈ సమయంలో … అరుణ్ జైట్లీ అమెరికాకు వెళ్లడం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పరిణామమే. ఎందుకంటే.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అరుణ్ జైట్లీనే సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాల్సి ఉంది. ఈ సారి రైతులకు, మధ్య తరగతికి తాయిలాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కసరత్తు అరుణ్ జైట్లీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన న్యూయార్క్ వెళ్లడంతో.. ఆ కసరత్తు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో అరుణ్ జైట్లీ… కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సమయంలో… పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ ఆయనకే ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
అరుణ్ జైట్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరు కాబట్టి.. ఆయన రాజకీయ జీవితానికి అనారోగ్యం వల్ల వచ్చే ముప్పేమీ లేదు. గత ఎన్నికల్లో…. మోడీ హవా.. ఓ రేంజ్ లో ఉన్న సమయంలో.. బీజేపీ కంచుకోట లాంటి నియోజకవర్గం అమృత్ సర్ లో.. క్రికెటర్ సిద్ధూని పక్కన పెట్టి.. మరీ పోటీచేశారు. కానీ పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ.. ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కింది. ఈ సారి ఇక ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఆయన చేయకపోవచ్చు.