ప్రస్తుతం న్యూయార్క్ లో పర్యటిస్తున్న కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ విజయ్ మాల్యా కేసు గురించి కొన్ని ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. “ఆయన భౌగోళికంగా భారత సరిహద్దులు దాటి లండన్ పారిపోయి దాక్కొన్నా చేసిన అప్పులన్నీ తీర్చకతప్పదు. ఈ వ్యవహారంలో ఆర్ధిక, క్రిమినల్ అంశాలు ఇమిడి ఉన్నాయి. వాటిని సంబంధిత సంస్థలు చూస్తున్నాయి. ఆయన సంస్థలకు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకొనేందుకు బ్యాంకులు కూడా వాటి ప్రయత్నాలు అవిచేస్తున్నాయి. అప్పులు తీసుకొన్నవారు వాటిని ఎగవేయకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత బ్యాంకులపైనే ఉంది. ప్రస్తుతం ఆయన కేసులపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది కనుక దీని గురించి ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను,” అని అన్నారు.
ఒక వ్యక్తికి లేదా సంస్థకు బ్యాంకులు అప్పు ఇచ్చేటప్పుడు, దానిని తిరిగి రాబట్టుకోవలసిన బాధ్యత అందుకు అవసరమయిన జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత వాటిదేననే అరుణ్ జైట్లీ చెప్పిన మాటలు నూటికి నూరుపాళ్ళు వాస్తవమే. దేశంలో బ్యాంకులన్నీ అటువంటి జాగ్రత్తలు చాలా తీసుకొంటున్నాయి కాకపోతే అవి రైతులు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఇచ్చే అప్పుల విషయంలోనే. ఆ తరువాత వారి ముక్కుపిండి మరీ ఏదో విధంగా బాకీలు వసూలు చేసుకొంటున్నాయి కూడా. కనుక సామాన్య ప్రజల వలన బ్యాంకులు మోసపోవడం చాలా అరుదుగా జరుగుతుంది.
సమస్య అంతా విజయ్ మాల్యా, సుబ్రతో రాయ్, సుజనా చౌదరి, కావూరి సాంభశివరావు వంటి పెద్ద మనుషులతోనే. వారి రాజకీయ పలుకుబడితో బ్యాంకులపై ఒత్తిడి తెచ్చి కావలసినంత డబ్బు యదేచ్చగా అప్పులుగా పట్టుకొని వెళ్లిపోతారు. కానీ తిరిగి చెల్లించరు. చెల్లించమని బ్యాంకులు కూడా వారిని గట్టిగా అడగలేవు. కారణం వారికున్న రాజకీయ పలుకుబడి, ప్రభుత్వంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలే.
యూ.పి.ఏ.ప్రభుత్వమే బ్యాంకులపై ఒత్తిడి తెచ్చి విజయ్ మాల్యాకి వేలకోట్లు అప్పులు ఇప్పించిందని భాజపా ఆరోపిస్తుంటే, ఆయన లండన్ పారిపోవడానికి మోడీ ప్రభుత్వమే సహకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వారి ఆరోపణలు విన్నట్లయితే ఆయన వెనుక ఎంత బలమయిన రాజకీయ శక్తులున్నాయో కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. మిగిలినవారి విషయంలో కూడా సేమ్ టు సేమ్ స్టోరీయే. కనుక అప్పులు తీసుకొన్నవారు తప్పించుకొని పారిపోకుండా చూసుకోవలసిన బాధ్యత బ్యాంకులదేనని అరుణ్ జైట్లీ చెప్పాడా హాస్యాస్పదం.
కావూరి సాంభశివరావు చెల్లించవలసిన రూ.1,000 కోట్లు బాకీలు వసూలు చేసుకోలేక ఆరేడు బ్యాంకుల ప్రతినిధులు హైదరాబాద్ లో ఆయన కార్యాలయం ముందు నోటికి గుడ్డ ముక్కలు కట్టుకొని, తమ బాకీలు చెల్లించవలసిందిగా ఆయనను వేడుకొంటూ ప్లకార్డులు పట్టుకొని మౌన ప్రదర్శన చేయవలసి వచ్చిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
విజయ్ మాల్యాని శిక్షించడం గురించి, బ్యాంకులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ మరి కావూరిపై ఎందుకు కటిన చర్యలు తీసుకోవడం లేదు. మారిషస్ బ్యాంక్ కి రూ. 106 కోట్లు చెల్లించనందుకు కోర్టులో కేసు, దానికి హాజరు కానందుకు అరెస్ట్ వారెంట్ కూడా అందుకొన్న సుజనా చౌదరిపై ఎందుకు చర్యలు చెప్పట్టడం లేదు? అంటే వారు అసమదీయులు కనుక అని అనుకోవలసి ఉంటుంది. మరి అటువంటప్పుడు అరుణ్ జైట్లీ ఈవిధంగా బ్యాంకులకి ఉపదేశాలు చేసి ఏమి ప్రయోజనం? అధికారంలో ఉన్నవారు ఇటువంటి ద్వంద విధానాలు అమలు చేస్తున్నంత కాలం ఆర్ధిక నేరస్తులు యదేచ్చగా ప్రజాధనాన్ని పట్టపగలే దర్జాగా కొల్లగొడుతూనే ఉంటారు. దాని వలన ఏదో ఒకనాడు భారత ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.