ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హౌదాపై చర్చ తతంగానికి మంగళం పాడతారని టీవీలు చూస్తున్న తెలుగువారందరికీ తెలుసు. నా వరకూ నేను ఈ విషయం చాలా స్పష్టంగా నిన్ననే చెప్పేశాను. అయితే ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అనుకున్న దానికన్నా అలవోకగా అతి దారుణంగా దాటవేతకు పాల్పడ్డారు. అటు రాజ్యసభసాక్షిగా ప్రధాని చదివిన లిఖితహామీల గౌరవాన్ని ఇటు ఆందోళనగా చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆఖరి ఆశలను నిర్దాక్షిణ్యంగా కాలరాచారు. అసలు ఈ చర్చను ప్రత్కేకహౌదాపై కాకుండా పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చగా మార్చడంలోనే బోలెడు రాజకీయం వుంది. అనేక విషయాలు ప్రస్తావించి చాలా చేశాము ఇదొక్కటే సమస్యాత్మకం గనక చేయలేకపోయాము అని సమర్థించుకోవడానికి వీలవుతుందనేది ఎత్తుగడ. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య ఘర్సణ గనక వస్తే లేక ఇతర రాష్ట్రాలు అభ్యంతరాలు తీవ్రంగా తీసుకొస్తే కాగలకార్యం గంధర్వులే తీర్చినట్టు అవుతుందనేది మరో పాచిక. కాని ఆ పరిస్థితి రాకపోవడంతో హౌదా నిరాకరణ కేవలం మోడీ సర్కారు నిర్వాకమేనని నిర్దంద్వంగా తేలిపోయింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి 14వ ఆర్థిక సంఘం అంటూ అతకని అంశాలు అనేక అవాస్తవాలు చెప్పారు. వాటిలోకి వెళ్లేముందు రాష్ట్రాల సమాఖ్య గురించి ఆయన రాజ్యాంగ స్వభావాన్నే తలకిందులు చేసి చూపడం సభలోనే సవాలు చేయబడింది. ఇది యూనిటరీ రాజ్యమా అని ఒక సభ్యుడు నిలదీసే పరిస్థితి ఎదురైంది.కేంద్రంలో వున్నారు గనకే ే విభజిత రాష్ట్రంలో జాతీయ సంస్థల ఏర్పాటు చేయడం కనీస బాధ్యతగా వుంటుంది దాన్ని కూడా ధార్మికతలాగా దాతృత్వంలాగా చెప్పడం విడ్డూరం. అది గాక ఆయన చెప్పినవన్నీ చూస్తాం చేస్తాంలే! జైట్లీ చెప్పిన 14 వ ఆర్థిక సంఘం వ్యవహారం కూడా మోసపూరితమే. దీనిపై గతంలోనే 360లోనే వివరంగా చర్చించాం.
. 14వ ఆర్థిక సంఘం ే. పేరులోనే వున్నట్టు 13 సంఘాల తర్వాత అది వచ్చింది. ఇది రాజ్యాంగం 280 వ అధికరణం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావలసిన పన్నుల వాటాను నిర్ధారించే వ్యవస్థ మాత్రమే తప్ప రాష్ట్రాల విభజన వంటి ప్రత్యేకాంశాలతో సంబంధం వుండదు. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ వైవిరెడ్డి చైర్మన్‌గా 14 వ ఆర్థిక సంఘాన్ని 2013 జనవరి 13న నియమించారు. అప్పటికి ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఆంధ్ర ప్రదేశ్ విభజనకు సంబంధించిన నిర్ణయం ప్రకటించలేదు. దానికి ఇచ్చిన పరిశీలనాంశాలలో( టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్)లో ప్రత్యేక హౌదా అన్న అంశమే లేదు. 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో తీవ్రమైన రభస మధ్య విభజన బిల్లు ఆమోదం పొందిన తరుణంలో ప్రధాని (మన్మోహన్ సింగ్) ప్రకటించిన ప్రత్యేక హౌదా గురించి అది పరిశీలించడంఎలా సాధ్యం? రాజ్యాంగం ప్రకారం మళ్లీ ఉత్తర్వును సవరించితే తప్ప తనకు నిర్దేశించని పని ఎలా చేస్తుంది?’
14 వ ఆర్థిక సంఘం దగ్గరకి వద్దాం. రాష్ట్రాలకు వాటాను32 శాతం నుంచి 42 శాతానికి పెంచాం గనక ఆంధ్ర ప్రదేశ్ అవసరాలన్ని తీరిపోయినట్టు చెప్పడంలో అర్థ రహితం. 42 శాతం అనేది అన్ని రాష్ట్రాలకు వర్తించే మామూలు పెరుగుదల. విభజనానంతర రాజధాని రహిత రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమీ చేసింది కాదు. ఆర్థిక సంఘాలు అంతకు ముందుకన్నా నిధుల పెరుగుదల సిపార్సు చేయడం మామూలుగా జరిగేదే. ఉదాహరణకు మొదటి ఫైనాన్స్ కమిషన్ కేవలం ఆదాయం పన్ను,ఎక్సయిజ్ సుంకాలనే పంపిణీ చేసింది. పదవ ఫైనాన్స్ కమిషన్ నాటికి అనేక ఇతర వనరుల పంపిణీ కూడా చేపట్టారు. అయినా రాష్ట్రాలకు రావలసిన దాంట్లో కొద్ది భాగమే ఇచ్చి కేంద్ర పెత్తనమే నడిపించారు. కనుకనే సర్కారియా కమిషన్ వంటివి అవసరమైనాయి.
14 వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు వచ్చేఆదాయం 45 శాతం పెరిగిందంటున్నారు గాని వాస్తవానికి పెరిగింది పదిశాతమే. 32 శాతం వున్నప్పుడు ఈ మొత్తం 3.48 లక్షల కోట్లు కాగా 42 శాతంకింద 5.26 కోట్లుగా వుంటుంది. మొత్తంపైన ఇది 1.78 లక్షల కోట్ల పెరుగుదల. ఇదంతా సకాలంలో సక్రమంగా మంజూరు చేసి విడుదల చేసినప్పటి మాట.కాని మరోవైపున కేంద్రం నుంచి రావలసిన గ్రాంట్లు వంటివాటిని మొత్తంగా ఎత్తివేశారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు(సిఎస్ఎస్)ల వ్యయం రాష్ట్రాలు అధికంగా భరించాలని ఆర్థికసంఘం చెబితే కేంద్రం ఆ పథకాలనే ఎత్తివేస్తానన్నట్టు మాట్లాడుతున్నది. లెక్కలుఎప్పుడూ శాతాలలో చూడాలి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర వనరులలో 6.937 శాతం లభించేది.ఇప్పుడు తెలంగాణకు 2.437 శాతం, ఎపికి 4.305 శాతం కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ రెండు కలిపిచూస్తే 6.472 శాతం అవుతుంది. ఇది గతంలో కన్నా పెరిగినట్టా? తగ్గినట్టా?
14వ సంఘం సిపార్సుల మేరకు ఎపికి 1,69,969 కోట్లు వస్తుంది. రెవెన్యూ లోటు కింద అయిదేళ్లలో 22,113 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. తుపానుల సహాయానికి గాను 90 శాతంకేంద్రమే భరించేవిధంగా 2492 కోట్లు సాయం, స్థానిక సంస్థల కోటాకింద మరో ప్రత్యేక సహాయం నిర్దేశించారు. ఇవన్నీ రావలసినవి ఈ లోగా 2014-15లో కేవలం 13,560 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి మంజూరైనాయి. ఒక్కఏడాది రెవెన్యూలోటు 18 వేల కోట్ల పైమాటేనని చెప్పిన కేంద్రం అయిదేళ్ల మీద కూడా పరిమితంగానే ఇవ్వాలనుకోవడం విభజన చట్టంలోని విషయాలకు కూడా భిన్నం.మరి చట్టంలో వున్నదానికన్నా ఎక్కువగా చేశామనే వారు వున్నవాటికే మీన మేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు?