డాలర్‌తో పోలిస్తే.. రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోతోంది. మూడు పైసలు తక్కువగా రూ. 72కి చేరుకుంది. ఇంత వేగంగా.. ఇంత దారుణంగా.. రూపాయి పడిపోతుందని.. ఎవరూ ఊహించలేదు. నాలుగైళ్ల కిందట.. రూ. 55 – రూ. 60 మధ్య ఊగిసలాడుతున్న డాలర్‌ను చూపించి… అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న మోడీ.. చాలా వెటకారపు ట్వీట్లు చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలాగే… రూపాయి చాలా బలహీనంగా ఉందని… సెటైర్లేశారు. రూపాయిని బలపరచడానికి కేంద్రం వద్ద బలం లేదని విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు దేశాన్ని భయపెట్టే స్థాయిలో రూపాయి విలువ పడిపోతోంది. ఇప్పుడు అధికారంలో ఉన్న మోడీ ఏం చేస్తున్నారు. ఆయన ఆర్థిక మంత్రి ఏం చేస్తున్నారు..? రూపాయి పతనాన్ని మార్కెట్‌కు వదిలేయండి..! భయపడాల్సింది.. కంగారు పడాల్సింది ఏమీ లేదని… చాలా తాపీగా సెలవిస్తున్నారు. ఇప్పుడే కాదు.. ముందు ముందు పతనమైన పట్టించుకోమని ముందస్తుగా చెప్పేస్తున్నారు.
గతంలో సంగతేమో కానీ.. ఇప్పుడు రూపాయి పతనం అయితే.. దేశప్రజలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. దేశీయంగా కూడా నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చాలా తీవ్రంగా ఉంటోంది. మన పెట్రోలియం ఉత్పత్తులు 80 శాతం దిగుమతులే. రూపాయి పతనం అవ్వడం వల్ల.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. ఇవి రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. వీటి ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. చమురు దిగుమతులకు మనం డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఓ వైపు విదేశీ పెట్టుబడులు వెనక్కి పోయి డాలర్లు తగ్గిపోతున్నాయి. మరో వైపు చమురు ధరలు పెరిగి డాలర్లలో ఎక్కువ చెల్లింపులు చేయాల్సి వస్తోంది. రూపాయి పతనం వల్ల కూడా డాలర్లు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. చమురు ధర పది డాలర్లు పెరిగితే.. 0.6 శాతం జీడీపీ తగ్గిపోతుంది. అంటే చమురు ధరలు పెరిగితే.. దేశ స్థూల జాతీయోత్పత్తి కూడా తగ్గుతుంది. కానీ ఆర్థిక మంత్రిగా ఇదేేమంత పెద్ద విషయంగా అనిపించడం లేదు.
2013లో దాదాపుగా ఇలానే రూపాయి దారుణంగా పతనం అవుతున్నప్పుడు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న రఘురాం రాజన్.. చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసి పతనాన్ని అడ్డుకున్నారు. బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించారు. పెట్టుబడులు తిరిగి పోకుండా.. అనేక నియంత్రణలు పెట్టారు. ప్రవాస భారతీయులు డాలర్లు తీసుకొచ్చి.. దేశంలో పెట్టుబడులుగా పెట్టడాన్ని ప్రొత్సహించారు. అలాంటి చర్యల వల్ల రూపాయి కొంత బలపడింది. కానీ ఇప్పటి ప్రభుత్వం .. పదవి విరమణ చేసిన రాజన్‌ను సైతం తప్పు పడుతోంది. చిన్నతరహా పరిశ్రమలు అంపశయ్యపై ఉండటానికి నోట్ల రద్దు కారణమని ఆర్థిక శాస్త్రవేత్తలందరూ చెబుతూంటే… ప్రభుత్వ పెద్దలు, వారి వందిమాగధులు.. రఘురాం రాజన్ వల్లేనంటూ నిందలేస్తున్నారు. ఏలా చూసినా… కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహిస్తోంది. ఏ ప్రయోజనాల కోసం చూస్తుందో..మరి…!