విభజన చట్టం ఇచ్చిన హామీలని అమలు చేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి చేయడం లేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కానీ ఆయన గత రెండేళ్ళుగా వాటికోసం ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉండటం రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా, మిత్రపక్షాలుగా సాగుతున్నప్పుడు, ఏ ప్రభుత్వమైన ఇదేవిధంగా వ్యవహరిస్తుంది తప్ప వేరే విధంగా వ్యవహరించదు. ఈ సంగతి చంద్రబాబుని నిందిస్తున్న ప్రతిపక్ష పార్టీలన్నిటికీ తెలుసు. కానీ తెలియనట్లుగా నిందిస్తున్నాయి. హోదా రాదని తెలిసిన్నప్పుడే ఆ విషయం ప్రజలకి చెప్పకుండా దాచిపెట్టడం వలనే ఆయన విమర్శలు ఎదుర్కోవలసివస్తోంది.
కేంద్రప్రభుత్వానికి ఇవ్వవలసినంత గడువు ఇచ్చిన తరువాత ఇప్పుడు చంద్రబాబు కొంచెం గట్టిగా అడుగుతున్నారు. ఆయన బ్రతిమలాడినంత కాలం ఆయనని చులకనగా చూసిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు గట్టిగా నిలదీసి అడిగేసరికి దిగివచ్చింది. ఇంతవరకు ప్రధాని మోడీ చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణాలు చేశారు. కానీ ఇప్పుడు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా ఆయనకి ఫోన్ చేసి, హామీల అమలు గురించి మాట్లడారు. ఆ విషయం ఆయనే స్వయంగా రాజ్యసభలో చెప్పుకొన్నారు కూడా. అందుకు కారణం చంద్రబాబు అమలు చేసిన వ్యూహమే నని చెప్పక తప్పదు.
ఈసారి ప్రధాని మోడీని, ఆర్ధిక మంత్రి జైట్లీని కలిసేందుకు తను వెళ్ళకుండా ఎంపిలని పంపారు. ఆయన వెళితేనే పట్టించుకోని ప్రధాని, ఆర్ధిక మంత్రి వారినేమి పట్టించుకొంటారు? అని చాలా మంది ప్రశ్నించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం సరైనదని అందరూ అంగీకరిస్తున్నారు. ఇంత హడావుడి చేసిన తరువాత ఒకవేళ చంద్రబాబు వారిని కలవడానికి వెళ్లి ఉండి ఉంటే, మళ్ళీ యధాప్రకారం హామీలు పునరుద్ఘాటించి తిప్పి పంపించేసేవారు. కానీ ఈసారి చంద్రబాబు తమని కలవడానికి ఇష్టపడటం లేదనే విషయం వారికి అర్ధమయ్యేలా చేయగలిగారు. ఎప్పుడూ మెతకగా ఉండే చంద్రబాబు ఇంత కటినంగా వ్యవహరించగలరని ఊహించకపోవడంతో అరుణ్ జైట్లీ కంగుతిన్నారు. అందుకే హడావుడిగా ఫోన్ చేసి మాట్లాడవలసి వచ్చింది. అయినప్పటికీ పార్లమెంటులో తెదేపా సభ్యుల ఆందోళన కొనసాగిస్తుండటంతో హామీల అమలుగురించి జైట్లీయే పదేపదే మాట్లాడుతున్నారిప్పుడు. కనుక చంద్రబాబు వ్యూహం బాగానే పనిచేసినట్లు స్పష్టం అవుతోంది. ఇదే వ్యూహం ఒక ఏడాది క్రితమే అమలుచేసి ఉండి ఉంటే, నేడు ఇన్ని కష్టాలు, విమర్శలు, గొడవలు ఉండేవి కావు కదా? కేంద్రప్రభుత్వం కూడా రాష్ట్రాభివృద్ధికి అవసరమైనన్ని నిధులు విడుదల చేసుండేది కదా. ఇప్పటికైనా మేల్కొని, కేంద్రప్రభుత్వాన్ని కూడా మేల్కొలిపినందుకు సంతోషించవలసిందే!