మాజీ కేంద్ర మంత్రి, ఒకప్పటి భాజపా సీనియర్ నేత అరుణ్ శౌరీ ప్రధాని నరేంద్ర మోడీని ఇందిరాగాంధీ, జయలలితలతో పోల్చారు. ఆయన కూడా వారిలాగే తీవ్ర అభద్రభావం కారణంగా నియంతృత్వ ధోరణిలో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఇండియా టుడే టీవీ ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అరుణ్ శౌరి మాట్లాడుతూ “ప్రధాని నరేంద్ర మోడీ తన నియంతృత్వ పోకడలతో, దేశంలో రాష్ట్రపతి పరిపాలన సాగిస్తున్నట్లుగా ఆయన ఒక్కరే పరిపాలిస్తున్నారు. తన పాలనను ఎవరూ ప్రశ్నించడానికి వీలులేదు..దాని గురించి తను ఎవరికీ సంజాయిషీలు చెప్పుకోనవసరం లేదన్నట్లుగా పరిపాలన సాగిస్తున్నారు. ఈ రెండేళ్ళలో ఆయన ప్రజాస్వామ్యవాదుల గొంతులను వినపడకుండా నిర్ధాక్షిణ్యంగా అణచివేశారు. తనను ప్రశ్నించేవారిని అణగద్రొక్కుతూ ఆయన పాలన సాగిస్తున్నారు. ఇక ముందు కూడా అలాగే వ్యవహరించవచ్చు. ఇటువంటి పాలన దేశానికి చాలా నష్టం కలిగిస్తుంది,” అని అన్నారు.
ఇటువంటి విమర్శలు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు లేదా ఇతర ప్రతిపక్షాల నుంచి తరచూ వినబడుతూనే ఉన్నాయి. అవి ప్రతిపక్షంలో ఉన్నాయి కనుక ఆవిధంగానే మాట్లాడుతాయని సరిపెట్టుకోవచ్చు కానీ వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అరుణ్ శౌరి, ప్రస్తుతం భాజపాకి దూరంగా ఉంటున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన గురించి ఈవిధంగా అభిప్రాయం వ్యక్తం చేయడం భాజపాలో అంతర్గతంగా పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా చూడవచ్చు. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీని భాజపా తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినప్పటి నుంచే పార్టీలో సీనియర్స్ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శత్రుఘన్ సిన్హా వంటి వారు అనేకమంది మోడీ నియంతృత్వ పోకడలు ప్రదర్శిస్తారనే భయంతో ఆయన అభ్యర్ధిత్వాన్ని గట్టిగా వ్యతిరేకించారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు కానీ వారి భయాలు మాత్రం నిజమయ్యాయి.
మోడీ నేతృత్వంలో భాజపా ఎన్నికలలో ఘన విజయం సాధించగానే ఆయన పార్టీలో, ప్రభుత్వంలో ఎవరూ ప్రశ్నించలేని స్థాయికి ఎదిగిపోయారు. తను కష్టపడి సంపాదించుకొన్న ఆ హోదాను, పరపతిని నిలబెట్టుకొనేందుకు మోడీ పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా తన చెపుచేతలలోకి తీసుకొని, తనకు నచ్చినట్లుగానే పాలన సాగిస్తున్నారు. అవినీతి లేకుండా సాగుతున్న ఆయన పాలనలో పారదర్శకత, చురుకుదనం కనిపిస్తున్నప్పటికీ, ఆయన అవలంభిస్తున్న నియంతృత్వ పోకడలే ఎన్డీయే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన ప్రభుత్వంపై కనిపిస్తున్న ఆర్.ఎస్.ఎస్. ముద్ర, దాని ప్రభావంతో తీసుకొంటున్న కొన్ని నిర్ణయాలు, భాజపాకి, ఎన్డీయే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెస్తున్నాయని చెప్పవచ్చు.
దేశాభివృద్ధి, చురుకుగా నిర్ణయాలు తీసుకొనే విషయంలో మోడీ పాలనను వేలెత్తి చూపడం సమంజసం కాదు కానీ తన పార్టీపై ఉన్న మతతత్వ పార్టీ ముద్రని చెరిపివేసి, తన సమర్ధమయిన పాలనతో పార్టీని ప్రజలకు మరింత సన్నిహితంగా తీసుకువెళ్ళగలిగే అవకాశం, తద్వారా పార్టీకి, ప్రభుత్వానికి, దేశానికి మంచిపేరు తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటిని మోడీ వదులుకొంటున్నట్లు కనిపిస్తోంది. గత యూపీయే ప్రభుత్వంతో పోలిస్తే మోడీ చాలా చక్కగా పరిపాలన కొనసాగిస్తున్నప్పటికీ చెడ్డ పేరు మూట గట్టుకోవడం ఎవరికయినా ఆశ్చర్యం కలిగించక మానదు.