సుప్రీం కోర్టు తీర్పుతో మూడు రోజుల క్రితమే మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నబం తుకి ఈరోజు ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి దొర్గీ ఖండు కుమారుడు ప్రేమ్ ఖండు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోబడ్డారు.
ఈరోజు ఆ రాష్ట్ర శాసనసభలో నబం తుకి తన బలం నిరూపించుకోవలసి ఉంది. కానీ 60 మంది శాసనసభ సభ్యులలో కేవలం 15 మంది మాత్రమే ఆయనకి మద్దతు ఇస్తున్నారు కనుక బలపరీక్ష జరిగితే నెగ్గే అవకాశం లేదు. అందుకే ఈరోజు జరుగవలసిన బలపరీక్షని మరో రెండు వారాలకి వాయిదా వేయమని తాత్కాలిక గవర్నర్ తధాగత్ రాయ్ ని ముఖ్యమంత్రి కోరినప్పటికీ ఆయన అంగీకరించలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు చివరి ప్రయత్నంగా నబం తుకి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శాసనసభా పక్ష నేతగా ఎన్నికయిన ప్రేమ్ ఖండుకి కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని కాంగ్రెస్ అధిష్టానం ఆశపడుతోంది. వారు భాజపాని వదిలిపెట్టి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొంటారో లేదో మరికొద్ది సేపటిలో తేలిపోతుంది.