అరుంధతి ని హిందీలో రీమేక్ చేస్తున్నారన్న సంగతి ఇప్పుడు హల్ చల్ చేస్తోందిప్పుడు. తెలుగునాట లేడీ ఓరియెంటెడ్ సినిమాల స్టామినా ఎలాంటిదో చూపించిన సినిమా ఇది. అనుష్కని హీరోయిన్ల లిస్టులో టాప్ పొజీషన్కి తీసుకొచ్చిన సినిమా ఇది. భారీ హంగులు, భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ సినిమా అనుష్క కెరీర్లో ఓ మైలు రాయిగా మిగిలింది.
ఇన్నాళ్లకు ఈ సినిమా హిందీలోకి వెళ్తుందని, అల్లు అరవింద్ ఈ సినిమాని బాలీవుడ్ లో తీస్తున్నారని, దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. 2009లో విడుదలైన సినిమా ఇది. ఇప్పటికి పదకొండేళ్లయ్యింది. తమిళ, మలయాళంలో డబ్ చేశారు. కన్నడలో రీమేక్ చేస్తే అక్కడ ఫ్లాప్ అయ్యింది. నిజానికి 2010లోనే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని శ్యాంప్రసాద్ రెడ్డి భావించారు. అనుష్క, రజనీకాంత్, షారుఖ్ఖాన్లను ప్రధాన పాత్రలుగా ఎంచుకుందామనుకున్నారు. తెలుగులో షాయాజీ షిండే చేసిన ఫకీర్ పాత్ర రజనీకి, పరుపతి పాత్ర షారుఖ్కి ఇద్దామనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఈ సినిమాని రీమేక్ చేయాలి. కానీ.. ఇప్పటికే బాగా లేట్ అయ్యింది. అరుంధతి హిందీ డబ్ వెర్షన్లు సోనీ టీవీల్లో తెగ ఆడేశాయి. పైగా అక్కడ మాయలు, మంత్రాల సినిమాలు పెద్దగా చూడరు. అందుకే.. అప్పట్లో శ్యాం ప్రసాద్ రెడ్డి రీమేక్ ఆలోచన పక్కన పెట్టారు. అయినా .. ఇన్నేళ్ల తరవాత.. అల్లు అరవింద్ ఈ సినిమాని హిందీలో రీమేక్ ఎందుకు చేయాలనుకుంటున్నారో?