ఆకలేసిన వాడికి అన్నం కావాలి. దాహంతో గొంతెండుతుంటే గుక్కెడు నీళ్లు పొయ్యాలి. మహారాష్ట్రలో దుర్భర కరువు కాటకాలు ఏర్పడ్డాయి. కనీసం 18 జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. లాతూర్ జిల్లాలోఅయితే నీటి చుక్క అనేదే కనిపించడం లేదు. చాలా కాలంగా వాన జాడేలేదు. అలాంటి లాతూర్ ప్రజల దాహం తీర్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రైళ్లలో నీళ్లు తెప్పించడం మొదలుపెట్టింది. మరోవైపు, అక్కడి ప్రజలకు 2 లక్షల లీటర్ల నీటిని పంపిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
మహారాష్ట్రలో గత వందేళ్లలో ఎన్నడూ చూడనంత కరువు ఏర్పడింది. దాహంతో జనం అలమటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్రంలోని ఐపిఎల్ మ్యాచ్ లకు మైదానాల నిర్వహణ కోసం సుమారు 70 లక్షల లీటర్ల నీటిని దుబారా చేయడం సరికాదంటూ హైకోర్టులోపిటిషన్ దాఖలైంది. అక్కడి కరువు పరిస్థితులు చూసిన వారికి కళ్లు చెమర్చుతాయి.
పరిస్థితి తీవ్రత గమనించిన కేజ్రీవాల్, మానవత్వంతో ముందుకు వచ్చారు. 2 లక్షల లీటర్ల నీటిని మహారాష్ట్రకు పంపుతామని తెలిపారు. రెండు నెలల పాటు నీరు సరఫరా చేస్తామన్నారు. ఈ నీటిని సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
నిజానికి ఢిల్లీకి కూడా నీటి సమస్య ఉంది. యమునా నది ప్రవహిస్తున్నా ప్రధానంగా నీటి అవసరాల కోసం హర్యానా పైనా ఆధారపడిన నగరం ఢిల్లీ. కేజ్రీవాల్ ఢిల్లీ లో నీటి సమస్యను ముందు పరిష్కరించాలని అక్కడి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సాధ్యంకాని హామీలను ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే నీళ్లు లేక మనుషులు, పశువులు ప్రాణాలు కోల్పోయే దారుణ పరిస్థితుల్లో సహాయం చేయడం తప్పు కాదనేది కేజ్రీవాల్ ఉద్దేశం.
ఈ ప్రకటన ద్వారా కేజ్రీవాల్ కొత్త మార్గం చూపారు. సాధారణంగా ఒక రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఇతర రాష్ట్రాలు చెక్కులు పంపుతాయి. లేదా సహాయక సామగ్రిని పంపుతాయి. ఇప్పుడు వచ్చింది నీటి సంక్షోభం. కాబట్టి అంతగా కరువు లేని, నీటి వనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రాలు రైళ్ల ద్వారా నీటిని పంపవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం లాగే మానవత్వంతో స్పందించ వచ్చు. లాతూర్ జిల్లాలో కనీ వినీ ఎరుగని దారుణపరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇతర రాష్ట్రాలు నీటి సాయం చేయడానికి ముందుకు వస్తే అది ఒక రకమైన పరిష్కారం అవుతుంది. ప్రజల దాహం తీరే అవకాశం వస్తుంది.