పంజాబ్ లో ఆప్ సునాయాసంగా గెలుస్తుందని మొన్నటి వరకూ చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్లకే అది అనుమానంగా మారింది. కారణం, అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న కొన్నినిర్ణయాలు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వేసే జోకులే ఇప్పుడు ఆప్ అధినేత కేజ్రీవాల్ పై వేస్తున్నారు కమలనాథులు, అకాలీలు. ఆయన ఇలాగే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నారు.
ఏకపక్షగా టికెట్ల కేటాయింపు ఆరోపణలు ఆప్ కు ఇబ్బందిగా మారాయి. మాజీ క్రికెటర్ సిద్ధూను మోసం చేశారనే శాపనార్థాలు కేజ్రీవాల్ ఇమేజికి మచ్చగా మారాయి. ఆప్ పంజాబ్ కన్వీనర్ ను నిర్దాక్షిణ్యంగా తొలగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేజ్రీవాల్ ప్రతిష్ట మసకబారుతున్నట్టు కనిపిస్తోంది. అదే ఆప్ నేతలకు ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామనే హామీని నమ్మిన సిద్ధూ నిండా మునిగాడని ఇప్పుడు పంజాబ్ లో టాక్. రాజ్యసభకు రాజీనామా చేసి, బీజేపీపై విమర్శలు గుప్పించిన సిద్ధూ, కేజ్రీవాల్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రికెటర్ గా సిద్ధూ సుపరిచితుడు. సీఎం అభ్యర్థిని చేస్తే పాపులారిటీలో కేజ్రీవాల్ ను మించి పోతాడనే భయం వల్లే పార్టీ నేతలు మాట తప్పారనే విమర్శలున్నాయి. పంజాబ్ లో ఇప్పుడు సిద్ధూకు సానుభూతి పెరిగింది. ఆయన్ని నమ్మించి మోసం చేశారంటూ కేజ్రీవాల్ పై విమర్శలూ పెరిగాయి. ఇక చేసేదేమీ లేక. సిద్ధూ కాంగ్రెస్ లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడట.
ఆప్ లో మొదటి నుంచీ ఢిల్లీ పెత్తనమే నడుస్తోందనే విమర్శలున్నాయి. ఆ మధ్య ఇదే అభిప్రాయం చెప్పినందుకు ఇద్దరు ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆప్ పంజాబ్ కన్వీనర్ సచ్చా సింగ్ ఛోటేపూర్ ను తొలగించడం దుమారం రేపింది. సిక్కు ప్రజల్లో ఎంతో మంచి పేరున్న వ్యక్తిని తొలగించడం కేజ్రీవాల్ చేసిన చారిత్రక తప్పిదాల్లో ఒకటనిఅంటున్నారు. సిక్కలకు, వారి సంస్కృతికి ఆప్ నేతలు వ్యతిరేకులనే ముద్ర వేయడానికి అకాలీ దళ్, కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కొన్ని ఉదాహరణలను గుర్తు చేస్తున్నారు. ఆప్ గెలిచినా ఢిల్లీ పెద్దలే రాజ్యమేలుతారంటూ ప్రచారం చేస్తున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ వైఖరి పార్టీని నిండా ముంచుతోందనే కోరస్ పెరుగుతోంది. పార్టీ పెట్టిన తర్వాత అందులోంచి బయటకు వెళ్లిన మేధావులు, ప్రముఖులే ఎక్కువ. కొత్తగా చేరినవాళ్లు చాలా తక్కువ. కేజ్రీవాల్ ఇలాగే తప్పులు చేస్తూ పోతే తమకు ఆప్ అసలు పోటీయే కాదంటున్నారు అకాలీదళ్, బీజేపీ నేతలు.