కాంగ్రెస్, బిజెపి పార్టీలతో పోల్చుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ప్రత్యేకం. ఆ పార్టీ పుట్టుక, ప్రచార విధానాలతో పాటు పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎక్కువమంది యువతరం ప్రతినిధులు కనిపిస్తారు. అర్థ శతాబ్ధం నుంచీ చూస్తున్న సో కాల్డ్ రాజకీయ నాయకులకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు ప్రజలతో ఎక్కువగా కలిసిపోయారు. అందుకే ఢిల్లీ ప్రజలు రికార్డ్ మెజారిటీతో గెలిపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ఆసక్తి కనిపించింది. కానీ కేజ్రీవాల్ ఏక్నింజన్ తెలివితేటలతో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న అవకాశాలను చంపేస్తున్నాడు. ఒక విషయంలో మాత్రం కేజ్రీవాల్‌కి సోనియా, నరేంద్రమోడీ, చంద్రబాబు, కెసీఆర్, జగన్‌లాంటి వాళ్ళకూ ఏమీ తేడా కనిపించడం లేదు. ఇంతకుముందు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ కూడా ఈ తప్పు చేసినవాడే.
ఇండియాలో ఉన్న పార్టీల అధినేతందరికీ కూడా వెన్నుపోటు భయం ఉంటుందో…..లేక వాళ్ళ సామర్థ్యంపైనే బోలెడన్ని అనుమానాలతో ఉంటారో కానీ పార్టీ అంతటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి అపసోపాలు పడుతూ ఉంటారు. పార్టీలో ఉన్న ప్రతి నాయకుడూ పార్టీ అధినేతకు భజన చేసేవాడే అయి ఉండాలి. పార్టీ అధినేత అభిప్రాయాలను వ్యతిరేకించిన వాళ్ళందరినీ బయటకు పంపించేస్తూ ఉంటారు. స్వతంత్ర వ్యక్తిత్వంతో పాటు ప్రజా బలం ఉన్న నాయకులను ప్రోత్సహించడానికి మన నాయకులకు అస్సలు మనసు ఒప్పదు. ఇలాంటి పద్ధతి కాంగ్రెస్, బిజెపిలతో పాటు దశాబ్ధాలుగా పాతుకుపోయిన పార్టీలకు బాగానే కలిసొచ్చింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఉండే ప్రత్యామ్యాయాలు చాలా తక్కువ కాబట్టి ఒకటి రెండు సార్లు ఓడిపోయినా మూడో సారి అధికారంలోకి వస్తామన్న నమ్మకంతో ఉంటాయి ఆ పార్టీలు. అందుకే ఎంత బలవంతుడైన నాయకుడు అయినా సరే అధినేతకు ఎదురుతిరిగిన వెంటనే బయటకు పంపించేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ అధినేతకే పేరు రావాలి. అధినేత గొప్పతనమే ప్రజలకు కనిపిస్తూ ఉండాలి. పార్టీలో ఉన్న నాయకులందరూ తమను తాము తగ్గించుకుని అధినేత భజన చేస్తూ ఉండాలి. అవసరమైతే అధినేత చేసిన తప్పులను తమపైన వేసుకునేలా ఉండాలి. ప్రజాస్వామ్యం గురించి అహర్నిశలూ గొప్పగా మాట్లాడుతూ ఉండే పార్టీల అధినేతలందరూ కూడా వాళ్ళ సొంత పార్టీల నాయకులకు మాత్రం అస్సలు స్వేచ్ఛ లేకుండా చేస్తారు. దానికి ‘క్రమశిక్షణ’ అని పేరెట్టుకుని మిగతా నాయకులందరినీ బానిసలను చేసి పడేస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న నాయకుల్లో కూడా ఎక్కువ మంది పరాన్నజీవులే కాబట్టి బానిసలుగా ఉండడానికి వాళ్ళకూ ఎటువంటీ ఇబ్బందీ ఉండదు. అధినేత భజన చేస్తూ…ప్రత్యర్థి పార్టీల అధినేతలను బండ బూతులు తిడుతూ బ్రతికేస్తూ ఉంటారు.
ఇలాంటి పద్ధతులన్నీ దశాబ్ధాలుగా ఉన్న అవినీతి రాజకీయ పార్టీలకు బాగానే సూట్ అయ్యాయి. ఒకసారి కాకపోతే మరోసారి అధికారంలోకి వచ్చేలా చేశాయి. మీడియా, డబ్బు బలం దండిగా ఉండడం కూడా ఆయా పార్టీలకు కలిసొస్తూ ఉంటుంది. కానీ ప్రజాబలం, కార్యకర్తల బలాన్నే నమ్ముకుని రాజకీయాలను మార్చేస్తాం అని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినవాళ్ళకు మాత్రం ఈ పద్ధతి ఆత్మహత్యా సదృశ్యమే. లోక్ సత్తా పార్టీలో జయప్రకాష్ నారాయణ తప్ప ఇంకో నాయకుడు కనిపించలేదు. ఇంకో నాయకుడిని ఎదగనివ్వలేదు. జయప్రకాష్ నారాయణ నిరంకుశత్వం గురించి ఆ పార్టీ నేతలే చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో సోనియాగాంధీ, నరేంద్రమోడీలాంటి వాళ్ళతో పోటీపడి గెలిచానన్న భ్రమల్లో ఉన్న కేజ్రీవాల్ కూడా ఇప్పుడు అలాంటి రాజకీయాలే చేస్తున్నాడు. తనను గెలిపించిన ఢిల్లీ ప్రజలను మెప్పించడం కంటే ప్రతి విషయంలోనూ నరేంద్రమోడీతో పోల్చుకోవడం, నరేంద్రమోడీని అనవసరంగా విమర్శిస్తూ ఉండడం లాంటి చేష్టలతో కమెడియన్లా మారిపోతున్నాడు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలో తాను తప్ప ఇంకో లీడర్ కనిపించకూడదు అన్న పాలసీని ఫాలో అవుతున్నట్టున్నాడు. పంజాబ్‌లో ఆప్ గెలిస్తే కేజ్రీవాలే ముఖ్యమంత్రి అన్న ప్రచారం అక్కడున్న ఆప్ లీడర్లకే నచ్చలేదు. కేజ్రీవాల్ ‘ఏక్‌నిరంజన్’ తెలివితేటల పుణ్యామని ఆమ్ ఆద్మీ పార్టీ భారీగానే నష్టపోయింది. ఆ పార్టీపైన ఆశలు పెట్టుకున్న అభిమానుల అంచనాలను కూడా వమ్ము చేశాడు కేజ్రీ. ఇప్పుడు తగిలిన దెబ్బ తర్వాత అయినా తన సొంత గొప్ప కంటే కూడా ఆమ్ ఆద్మీ పార్టీని గొప్పగా నిలబెట్టే చర్యలు ఏమైనా తీసుకుంటాడేమో చూడాలి. అలాగే ప్రతి రాష్ట్రంలోనూ ఆప్ వెలిగిపోవాలి అని కోరుకోవడం తప్పుకాదు కానీ అన్ని రాష్ట్రాల్లోనూ తానే లీడర్‌గా ఉండాలి అని కేజ్రీ కోరుకోవడం మాత్రం పార్టీతో పాటు ఆయనకు కూడా నష్టం చేసేదే. ఇప్పటికైనా తన స్థాయి ఏంటో తెలుసుకుని…పార్టీ స్థాయిని పెంచడం కోసం కేజ్రీ చర్యలు తీసుకుంటాడేమో చూడాలి. అలాగే పార్టీలో ఉన్న సమర్థవంతులైన నాయకులకు ఎదిగే అవకాశాలు కల్పిస్తాడేమో చూడాలి. అలా చేస్తేనే పార్టీ ఉంటుంది. లేకపోతే 2019 తర్వాత కేజ్రీ ఒక్కడే మిగిలే అవకాశాలు కూడా ఉంటాయి. నరేంద్రమోడీని తక్కువ అంచనా వేసే దుస్సాహసం కూడా మరోసారి చేయకుండా ఉంటే కేజ్రీకే మంచిది.